Shakira: తొలిసారి షకీరా కాన్సర్ట్ లైవ్ స్ట్రీమింగ్.. భారత్‌లో ఎప్పుడు చూడొచ్చు?
ఈ వార్తాకథనం ఏంటి
పాప్ సింగర్‌గా తన గానంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న కొలంబియన్ గాయని షకీరా (Shakira) తొలిసారి తన కాన్సర్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. షకీరా పాటలకు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉండటంతో.. ఆమె కాన్సర్ట్ నిర్వహిస్తే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతుంటాయి. అలాంటి షకీరా తొలిసారి తన ప్రత్యక్ష ప్రదర్శనను ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్టోబరు 3న మాడ్రిడ్‌లో జరగనున్న షకీరా షోను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భారత్‌లో ఈ లైవ్ స్ట్రీమింగ్‌ను అర్ధరాత్రి 12.15 గంటలకు వీక్షించవచ్చు. అంటే అక్టోబరు 3వ తేదీ రాత్రి ప్రారంభమయ్యే ఈ ప్రదర్శనను భారతీయ ప్రేక్షకులు తెల్లవారితే అక్టోబరు 4న వీక్షించనున్నారు.
వివరాలు
డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ లైవ్ షోను అమెజాన్ మ్యూజిక్ ఇండియా యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీతో పాటు అమెజాన్ మ్యూజిక్ ఛానల్ ట్విచ్‌లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
ముఖ్యంగా ఈ షోను వీక్షించేందుకు అభిమానులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే షకీరా లైవ్ కాన్సర్ట్‌ను వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.
ప్రస్తుతం షకీరా మాడ్రిడ్ రెసిడెన్సీలో వరుస ప్రదర్శనలు ఇస్తున్నారు. సెప్టెంబరు 18న ప్రారంభమైన ఈ షెడ్యూల్ అక్టోబరు 11 వరకు కొనసాగనుంది.
ఇందులో భాగంగానే అక్టోబరు 3న జరగనున్న మాడ్రిడ్ ప్రదర్శనను ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.
వివరాలు
గాయని, గేయ రచయిత, డ్యాన్సర్‌గా ప్రత్యేక గుర్తింపు
పాప్ సంగీత ప్రపంచంలో షకీరా గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
గాయనిగా మాత్రమే కాకుండా గేయ రచయిత, డ్యాన్సర్, నిర్మాత, కొరియోగ్రాఫర్‌గా ఆమె బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు.
లాటిన్, అరబిక్, రాక్ అండ్ రోల్, బెల్లీ డ్యాన్స్‌లలోనూ షకీరాకు మంచి ప్రావీణ్యం ఉంది. 'హిప్స్ డోంట్ లై', 'వెనెవర్.. వేరెవర్', 'షీ వోల్ఫ్', 'వాకా వాకా' వంటి ఎన్నో ప్రముఖ ఆల్బమ్స్, పాటలతో షకీరా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా 2010 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఆమె పాడిన 'వాకా వాకా: ది టైమ్ ఫర్ ఆఫ్రికా' పాట ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఇప్పుడు తొలిసారి తన మాడ్రిడ్ ప్రదర్శనను ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.