
Sharmila Tagore: పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్.. షర్మిలా ఠాగూర్ అసహనం
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ గౌరవార్థంగా ప్రదానం చేసే పటౌడీ ట్రోఫీ (Pataudi Trophy)ను రిటైర్మెంట్‌కు పంపాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB),భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.
జూన్-జులైలో నిర్వహించనున్నటెస్ట్ సిరీస్ నుంచే ఈసీబీ ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.
ఈ అంశంపై మన్సూర్ అలీఖాన్ సతీమణి,ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ (Sharmila Tagore) స్పందించారు.
వివరాలు
సైఫ్ అలీఖాన్‌కు లేఖ రాసిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు
బీసీసీఐ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ''ట్రోఫీ రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించిందా? అనే విషయంపై మాకు ఎటువంటి సమాచారం అందలేదు. అయితే, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నా కుమారుడు సైఫ్ అలీఖాన్‌కు ఇటీవల లేఖ రాసింది.అందులో ఈ ట్రోఫీని ముగించాలని వారు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.బీసీసీఐ కూడా దీనిని సమర్థిస్తే, క్రికెట్‌కు మన్సూర్ అలీఖాన్ అందించిన సేవలను గుర్తుపెట్టుకోవాలా లేదా అనేది వారి నిర్ణయమే'' అని వ్యాఖ్యానించారు.
మన్సూర్ అలీఖాన్ పటౌడీ 1961 నుంచి 1975 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 46 టెస్టు మ్యాచ్‌లు ఆడారు.
2011లో ఆయన మరణించారు.
వివరాలు
ఇతర దిగ్గజ క్రికెటర్ల పేరుతో కొత్త ట్రోఫీ
1997 నుండి ఇంగ్లాండ్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా పిలుస్తున్నారు.
అయితే, ఈ ట్రోఫీని రద్దు చేయడానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు.
ఇకపై ఇరు దేశాలకు చెందిన ఇతర దిగ్గజ క్రికెటర్ల పేరుతో కొత్త ట్రోఫీ ఇవ్వొచ్చనే చర్చలు జరుగుతున్నాయి.
అయితే, దీనిపై ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు.
అలాగే, బీసీసీఐ నుంచి కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు.