Loading...
Sowcar janaki life-story: ఇల్లు గడవక నటిగా మారి.. షావుకారు జానకి జీవితంలో అడుగడుగునా ఏం జరిగిందంటే..
ఇల్లు గడవక నటిగా మారి.. షావుకారు జానకి జీవితంలో అడుగడుగునా ఏం జరిగిందంటే..

Sowcar janaki life-story: ఇల్లు గడవక నటిగా మారి.. షావుకారు జానకి జీవితంలో అడుగడుగునా ఏం జరిగిందంటే..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 21, 2026
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటనకు నిలువెత్తు నిదర్శనం షావుకారు జానకి. తెలుగు తెరపై సహజ నటనకు కొత్త అర్థం చెప్పిన నటి ఆమె. ఎలాంటి పాత్ర ఇచ్చినా తనదైన శైలిలో నటించి అందులో జీవం పోసిన కళాకారిణి. తరాలు మారినా.. నటిగా ఆమెకున్న ప్రత్యేక స్థానం మాత్రం చెక్కుచెదరలేదు. అగ్ర కథానాయకుల సరసన ఎన్నో చిత్రాల్లో నటించిన జానకి సినీ జీవితం మాత్రం పూలబాటలా సాగలేదు. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానానికి సంబంధించిన పలు విషయాలను షావుకారు జానకి గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

వివరాలు

గాంధీజీకి సేవలో ఇలా..

దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ పాఠశాలలో జానకి చదువుకుంటున్న సమయంలో మహాత్మా గాంధీ హిందీ ప్రచార్ సభకు వచ్చారు.

ఆ సమయంలో ఆయన భోజనం, వసతి సౌకర్యాలను చూసుకునే బాధ్యతను జానకికి అప్పగించారు.

దీంతో జవహర్‌లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, ఇందిరాగాంధీ వంటి ఎంతోమంది ప్రముఖులను నేరుగా కలిసే అవకాశం ఆమెకు దక్కింది.

ఈ అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తానని జానకి ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

వివరాలు

పెళ్లి తర్వాత సినిమాల్లోకి..

జానకికి 15 ఏళ్ల వయసులోనే సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆ అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత రేడియో ఇంజినీర్‌గా పనిచేస్తున్న శంకరమంచి శ్రీనివాస్‌తో ఆమెకు వివాహం జరిగింది.

అయితే పెళ్లి తర్వాత ఆమె జీవితంలో అనుకోని కష్టాలు మొదలయ్యాయి.

ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయం కారణంగా దంపతులకు పెద్దగా ఆస్తి దక్కలేదు. దీంతో కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా మారింది.

కొన్ని రోజులకు కనీసం సంసారం గడపడం కూడా ఇబ్బందిగా మారింది.

అయితే ఎన్ని కష్టాలు వచ్చినా పుట్టింటికి వెళ్లాలని జానకి అనుకోలేదు. తనకు తెలిసిన విద్య నటన ఒక్కటేనని భావించారు.

ADVERTISEMENT

వివరాలు

రావద్దని మొహం మీదే చెప్పారు..

భర్త అనుమతితో సినిమాల్లోకి అడుగుపెట్టారు. అయితే సినీ రంగంలోకి వచ్చిన కొద్ది రోజులకే భర్తతో విభేదాలు వచ్చాయి.

ఆ తర్వాత పిల్లల బాధ్యతను కూడా జానకే తీసుకున్నారు. తల్లిగా, తండ్రిగా అన్నీ తానై పిల్లలను పెంచుకున్నారు.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత బంధువులు తనను ఇంట్లోకి కూడా రానివ్వలేదని జానకి ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.

సినిమాల్లో నటించడం, హీరోలతో తాళి కట్టించుకునే సన్నివేశాల్లో కనిపించడం, ఫస్ట్‌నైట్ సీన్లలో డ్యాన్స్ చేయడం వంటివి తమ కుటుంబ సభ్యులకు నచ్చలేదని చెప్పారు.

ఇల్లు వెతుక్కునే సమయంలో ఒకసారి బంధువుల ఇంట్లో రాత్రి నిద్రపోవడానికి వెళ్లగా.. ''వద్దమ్మా.. అంకుల్ ఏదైనా అంటారు. రావద్దు'' అని తన ముఖం మీదే చెప్పారని జానకి ఆవేదన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

వివరాలు

బాధపడిన సందర్భాలు ఎన్నో..

90 ఏళ్ల వయసు వచ్చినా నటిస్తూనే ఉండాలనేది షావుకారు జానకి కోరిక. అయితే అది నెరవేరకపోవడం ఆమెను బాధించేదట.

ఆమె తమిళంలో నటించిన సినిమాలు విజయవంతమైతే.. వాటిని తెలుగులోనూ రీమేక్ చేసేవారు.

కానీ తెలుగు సినిమాల్లో మాత్రం తనను హీరోయిన్‌గా తీసుకునేవారు కాదని జానకి చెప్పారు. ఆ సమయంలో తన మనసు బాధపడేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

''నేను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. నిర్మాతల డబ్బులతో జల్సా చేయలేదు.

సినిమాకు ఏది అవసరమో అదే చేసేదాన్ని. ఎన్నో దెబ్బలు తిన్నాను. చాలా సార్లు నిరాశ చెందాను.

మా కుటుంబంలో నాకంటే చిన్నవాళ్లు కూడా నా కంటే ముందే చనిపోయారు. అలాంటి సందర్భాల్లో మాత్రం చాలా బాధపడేదాన్ని'' అని జానకి చెప్పుకొచ్చారు.

వివరాలు

శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసి..

దివంగత నటి శ్రీదేవిని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది కూడా షావుకారు జానకినే.

అప్పటికి శ్రీదేవికి కేవలం ఆరేళ్లు మాత్రమే. వాహిని స్టూడియోస్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సమయంలో శ్రీదేవి తల్లి రాజేశ్వరిగారు పాపను తీసుకుని దూరంగా నిలబడి షూటింగ్‌ను చూస్తున్నారు. అప్పుడు తాను శ్రీదేవిని తీసుకోవాలని సూచించానని జానకి తెలిపారు.

శ్రీదేవి తల్లితో మాట్లాడగా ఆమె కూడా అంగీకరించారని చెప్పారు. మేకప్ టెస్ట్ చేసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారని.. బాల మురుగన్ పాత్రకు శ్రీదేవి అద్భుతంగా సరిపోయిందని జానకి గుర్తుచేసుకున్నారు.

చిన్న చిన్న డైలాగులు చెప్పమంటే అద్భుతమైన హావభావాలతో నటించడంతో.. మరో ఆలోచన లేకుండా శ్రీదేవిని ఎంపిక చేశారని జానకి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ADVERTISEMENT