Bloody Romeo: 'బ్లడీ రోమియో' కోసం రంగంలోకి దిగిన సుజీత్.. లండన్‌లో లొకేషన్ల వేట
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో వరుసగా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న న్యాచురల్ స్టార్ నాని, స్టైలిష్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'బ్లడీ రోమియో'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఓజీ' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల జూలై నుంచి ప్రారంభం కానుంది. షూటింగ్‌కు ముందు నుంచే చిత్రాన్ని విజువల్‌గా అత్యంత గ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు సుజీత్ తన టెక్నికల్ టీమ్‌తో కలిసి ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
విదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్
ప్రస్తుతం దర్శకుడు సుజీత్ తన బృందంతో కలిసి లండన్‌లో లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నారని సమాచారం. సినిమా కథలోని ప్రధాన భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా లండన్, బుడాపెస్ట్, హంగేరీ వంటి ఖరీదైన, అందమైన లొకేషన్లలో కీలక యాక్షన్, డ్రామా సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌లో దాదాపు 80 శాతానికి పైగా యూరప్‌లోనే జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన 20 శాతం టాకీ పార్ట్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వివరాలు
'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్‌పైనే దృష్టి
ఇప్పటికే విడుదలైన యానిమేటెడ్ గ్లింప్స్‌లో నాని 'చెఫ్ కమ్ గ్యాంగ్‌స్టర్' పాత్రలో కనిపించి సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. సుజీత్‌కు ప్రత్యేకమైన స్టైలిష్ మేకింగ్, నాని విలక్షణ నటన కలిసివస్తే ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఆగస్టులో విడుదల కానున్న 'ది పారడైజ్' సినిమా తర్వాత నాని పూర్తిస్థాయిలో 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్‌పైనే దృష్టి సారించనున్నట్లు సమాచారం.