Sukesh Chandrashekhar: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీపై సుకేశ్ ఫైర్.. విడుదల ఆపేయాలంటూ లీగల్ నోటీసులు!
ఈ వార్తాకథనం ఏంటి
వివాదాస్పద ఆర్థిక నేరాల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్.. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న డాక్యుమెంటరీపై న్యాయపోరాటానికి దిగాడు. 'లవ్, స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ డాక్యుమెంటరీ నిర్మాతలతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు పంపించాడు. తన జీవితాన్ని ఏకపక్షంగా చూపించేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించారని అతడి తరఫు న్యాయవాదులు ఆరోపించారు. తాను ఎదుర్కొంటున్న కేసుల్లో ప్రాసిక్యూషన్ ఆధారాల నమోదు పూర్తయ్యే వరకు డాక్యుమెంటరీ విడుదలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 18న విడుదల కావాల్సి ఉంది.
వివరాలు
నెట్‌ఫ్లిక్స్‌కు 72 గంటల గడువు
సుకేశ్ తరఫున అనంతం లీగల్ న్యాయవాదుల బృందం ఈ నోటీసులు పంపించింది.
అడ్వకేట్ అనంత్ మాలిక్ పంపిన నోటీసుల్లో.. డాక్యుమెంటరీలో ప్రస్తావించిన క్రిమినల్ కేసులకు సంబంధించిన ప్రాసిక్యూషన్ ఆధారాల నమోదు పూర్తయ్యే వరకు విడుదలను నిలిపివేయాలని కోరారు.
దీనిపై స్పందించేందుకు డాక్యుమెంటరీ నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్‌కు 72 గంటల గడువు ఇచ్చారు.
ఈ డాక్యుమెంటరీలో ప్రస్తావించిన ఆరోపణలు.. రూ.200 కోట్ల వసూళ్ల కేసు, తీహార్ జైలులో జరిగినట్లు ఆరోపిస్తున్న ఘటనలకు సంబంధించినవని న్యాయవాదులు పేర్కొన్నారు.
వివరాలు
డాక్యుమెంటరీ పేరుతో బహిరంగ విచారణ..
తనపై నమోదైన కేసుల్లో ఒక్క కేసు మినహా మరే ఇతర కేసులోనూ దోషిగా నిర్ధారణ కాలేదని, ఆ ఒక్క కేసులోనూ ప్రస్తుతం అప్పీల్ పెండింగ్‌లో ఉందని సుకేశ్ న్యాయవాదులు తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో డాక్యుమెంటరీ విడుదల చేయడం బహిరంగ విచారణకు దారితీస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం విడుదల వాయిదా వేయడమే కాకుండా.. డాక్యుమెంటరీని ముందుగా తనకు చూపించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తావించిన కేసుల్లో ప్రాసిక్యూషన్ ఆధారాల నమోదు పూర్తయ్యే వరకు డాక్యుమెంటరీని, ట్రైలర్లను విడుదల చేయబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు.
అలాగే ప్రచార సామగ్రిలో సుకేశ్‌ను 'కాన్‌మ్యాన్' (మోసగాడు)గా అభివర్ణించే పదాలను తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
వివరాలు
రూ.200 కోట్ల వసూళ్ల కేసు నేపథ్యమేంటి?
నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న 'లవ్, స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ' డాక్యుమెంటరీలో రూ.200 కోట్ల వసూళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ జీవితాన్ని చూపించనున్నారు.
గతంలో 'కర్రీ అండ్ సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్', 'ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్' వంటి డాక్యుమెంటరీలను రూపొందించిన బృందమే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
సుకేశ్ నేపథ్యం, తీహార్ జైల్లో ఉన్నప్పటికీ అతడు ఇంత పెద్ద స్థాయిలో కార్యకలాపాలు ఎలా సాగించాడనే అంశాలపై రెండేళ్లపాటు పరిశోధన చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ కేసులో సుకేశ్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
రూ.200 కోట్ల వసూలు చేసినట్లు ఆరోపణలు
ఢిల్లీలోని రోహిణి జైలులో ఉన్న సమయంలో.. తాను సీనియర్ ప్రభుత్వ అధికారినని చెప్పుకుంటూ, మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ నుంచి సుమారు రూ.200 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఆమె భర్తను జైలు నుంచి విడుదల చేయిస్తానని హామీ ఇచ్చి డబ్బులు తీసుకున్నట్లు కేసు నమోదైంది.
ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసుల ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) దర్యాప్తు చేపట్టింది. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఈ కేసులో సుకేశ్‌కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించగా.. ఆ తీర్పుపై అతడు అప్పీల్ చేశాడు.