Mahendragiri Varahi: సడన్‌గా ఓటీటీలోకి సుమంత్ సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
గత నెల థియేటర్లలో విడుదలై ఫర్వాలేదనిపించిన యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ఆశ్చర్యపరిచింది. సుమంత్ (Sumanth) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి (Meenakshi Goswami) కథానాయికగా కనిపించింది. ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh), మాళవికా నాయర్ (Malavika Nair), బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. గతంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రాన్ని తెరకెక్కించిన సంతోష్ జాగర్లమూడి (Santhossh Jagarlapudi) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టిల్లు సిద్దు జొన్నలగడ్డ గెస్ట్ రోల్‌లో మెరిశాడు. సెప్టెంబరు 11న 'మహేంద్రగిరి వారాహి' థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకులను పెద్దగా థియేటర్లకు రప్పించలేకపోయినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.
వివరాలు
ఇంతకీ కథేంటి?
సుమారు 200ఏళ్ల క్రితం మహేంద్రగిరి రాజవంశానికి వారాహి అమ్మవారు శాపం ఇస్తుంది. ఆ వంశంలో పుట్టే పురుషులెవరూ 33 ఏళ్లకు మించి జీవించరనేది ఆ శాపం.
అమ్మవారు ఏదో ఒకరోజు కరుణిస్తారనే నమ్మకంతో రాజవంశీకులు పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నప్పటికీ.. శాపం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.
మరోవైపు భక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారి ఆట కట్టిస్తూ ఉంటాడు యూట్యూబర్ సిద్ధార్థ్ (సుమంత్). అయితే ఒకరోజు అతడి అన్నయ్య పెళ్లికి ముందు దోష నివారణ కోసం అమ్మవారి ఆలయానికి వెళ్లి అనుకోకుండా మృతి చెందుతాడు.
అదే సమయంలో రాజవంశానికి చెందిన ఓ వారసుడు కూడా ప్రాణాలు కోల్పోతాడు. దీంతో అమ్మవారు తన భక్తులను రక్షించాల్సింది పోయి ఎందుకు చంపుతున్నారనే ప్రశ్న సిద్ధార్థ్‌లో మొదలవుతుంది.
వివరాలు
ఎలా ఉందంటే..
ఈ మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు అతడు రంగంలోకి దిగుతాడు.
ఈ క్రమంలో హీరో అంతుచిక్కని రహస్యాలను ఛేదించాడా? అసలు రాజవంశానికి ఆ శాపం ఎందుకు వచ్చింది? రాజవంశీకుల వరుస మరణాలకు కారణాలేంటి? అనేదే సినిమా కథ.
గతంలో మహేశ్‌బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'మురారి' సినిమా తరహా కథతోనే 'మహేంద్రగిరి వారాహి' రూపొందడం విశేషం.
సినిమా చివరి వరకు ఉత్కంఠను కొనసాగిస్తూ.. వరుస ట్విస్టులతో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అయితే హీరో కథలోకి ఆలస్యంగా ప్రవేశించడం కొంత నిరాశ కలిగిస్తుంది.
వివరాలు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
అలాగే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. ఈ అంశాలు మినహా థ్రిల్లర్ కథ, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ప్రస్తుతం 'మహేంద్రగిరి వారాహి' అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
థ్రిల్లర్, దైవభక్తి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి ప్రయత్నించవచ్చు.