2022 రివైండ్: బాక్సాఫీసు దగ్గర మెరిసిన కుర్ర హీరోలు
2022 సంవత్సరం తెలుగు బాక్సాఫీసు వసూళ్ళ వర్షంతో నిండిపోయింది. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా ఉత్సాహంగా ఉంది. అదే ఉత్సాహంలో 2023లో మరిన్ని విభిన్నమైన కథలు అందించేందుకు రెడీ అవుతోంది. ఐతే ఈ సంవత్సరం చిన్న హీరోలు బాక్సాఫీసు వద్ద తమ సత్తా చాటారు. కరోనా తర్వాత కేవలం పెద్ద సినిమాలు చూడడానికే జనాలు థియేటర్ కి వస్తారని అందరూ అనుకున్న సమయంలో ఈ చిన్న హీరోలు దుమ్ము దులిపారు. అడవి శేష్: ఈ సంవత్సరం మేజర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత హిట్ 2 సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం గూఢాచారి సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు అడవి శేష్.
నిఖిల్ సిద్ధార్థ్, విశ్వక్ సేన్
నిఖిల్: కార్తీకేయ2 సినిమా థియేటర్లలోకి రావడానికి కొంత కష్టపడ్డాడు నిఖిల్. కానీ రిలీజ్ అయ్యాక ఆ సినిమా చూపించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. హిందీ ఆడియన్స్ మతులు పోగొట్టింది ఆ సినిమా. అందుకే 100కోట్లు కొల్లగొట్టింది. స్టార్ లేకపోయినా వందకోట్ల వసూళ్ళు రాబట్టవచ్చని నిరూపించిన సినిమా కార్తీకేయ 2. ఈ డిసెంబరులో 18 పేజెస్ తో మళ్ళీ థియేటర్లలో కనిపించాడు నిఖిల్. హాయిగొలిపే ప్రేమకథతో తన విజయాల జాబితాను ఇంకొంచెం పెంచుకున్నాడు నిఖిల్. ఇక మూడవ హీరో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలోని తన నటనకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఓరి దేవుడా సినిమాతో మరో మంచి ప్రేమకథను ప్రేక్షకులకు అందించాడు.