AP High Court: న్యాయరంగంలో అరుదైన ఘట్టం.. హైకోర్టుకు మహిళా ప్రధాన న్యాయమూర్తి నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లిసా గిల్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో గురువారం సమావేశమైన కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఆమోదం లభిస్తే, ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ పదవీకాలం ఏప్రిల్ 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ విరమణకు రెండు నెలల ముందుగానే జస్టిస్ లిసా గిల్‌ను ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది.
Details
పంజాబ్-హరియాణా హైకోర్టులో సేవలందించిన అనుభవం
జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ బాధ్యతల నుంచి వైదొలిగిన మరుసటి రోజు నుంచే జస్టిస్ లిసా గిల్‌ను సీజేగా నియమించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం జస్టిస్ లిసా గిల్ పంజాబ్-హరియాణా హైకోర్టులో సేవలందిస్తున్నారు. అక్కడ సీనియారిటీ పరంగా మూడో స్థానంలో ఉన్నారు. ఆమె స్వస్థలం చండీగఢ్. అక్కడి కార్మెల్ కాన్వెంట్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో హ్యుమానిటీస్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం చదివారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని పంజాబ్-హరియాణా హైకోర్టులో న్యాయవృత్తిని ప్రారంభించారు. సుదీర్ఘకాలం చండీగఢ్‌కు, పలు ప్రభుత్వరంగ బోర్డులు, కార్పొరేషన్లకు న్యాయపరమైన సేవలు అందించారు. 2014 మార్చి 31న పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Details
భర్తీలో కొత్త సంప్రదాయం
ఇదిలా ఉండగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంలో సుప్రీంకోర్టు కొలీజియం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుత సీజే పదవీవిరమణకు రెండు నెలల ముందే కొత్త ప్రధాన న్యాయమూర్తిని ప్రతిపాదించాలని నిర్ణయించింది. న్యాయపాలన వ్యవస్థను బలోపేతం చేసి, సామర్థ్యం, నాణ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ విధాన నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధానంలో భాగంగా సీజేగా ప్రతిపాదితులైన న్యాయమూర్తులను రెండు నెలల ముందుగానే సంబంధిత హైకోర్టుకు బదిలీ చేయనున్నారు. దీని ద్వారా వారు ఆ హైకోర్టు వాతావరణానికి అలవాటు పడే అవకాశం కలుగుతుందని వెల్లడించారు.
Details
ధీరజ్‌సింగ్ ఠాకుర్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించే అవకాశం
అదే విధంగా జస్టిస్ లిసా గిల్‌ను ముందుగా ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేసి, ప్రస్తుత సీజే పదవీ విరమణ అనంతరం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేలా సిఫార్సు చేశారు. మరోవైపు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తే, ఆ స్థానంలో జస్టిస్ లిసా గిల్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.