తెలుగు సినిమా: అమ్మ అనే మాట లేకుండా అమ్మ గొప్పదనాన్ని తెలియజేసే పాట మీకు తెలుసా?
అమ్మ పాటలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. గుండెను తట్టి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటాయి. తెలుగు సినిమాల్లో అమ్మ పాటలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రస్తుతం తెలుగు సినిమాల్లోని అమ్మ పాటల గురించి మాట్లాడుకుందాం. పెదవే పలికిన తియ్యని మాటే: అమ్మ పాట గురించి మాట్లాడాలంటే ఎవ్వరికైనా ఈ పాటే గుర్తొస్తుంది. నాని సినిమా ఫ్లాప్ అయినా, పాట మాత్రం సక్సెస్ అయ్యింది. ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసారు. సిరులొలికించే చిన్ని నవ్వులే: యమలీల చిత్రంలోని ఈ పాట, 90 కిడ్స్ కి చాలా ప్రత్యేకం. అమ్మెప్పుడూ పిల్లలు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటుంది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసారు.
అమ్మ అనే పదం లేకుండా అమ్మ పాట
నీవే నీవే - అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి: నాకన్నీ నువ్వే అమ్మా, నువ్వు లేనిదే నేను లేను, నా కష్టం, ఇష్టం, దిగులు, సంతోషం అన్నీ నీతోనే అని సాగే ఈ పాటలో అమ్మ అనే పదం ఎక్కడా కనిపించదు. కానీ ఈ పాట ఎప్పటికీ అందరి గుండెల్లో ఉండిపోతుంది. కనిపెంచిన మా అమ్మకే - మనం: అమ్మ పంచే ప్రేమను మళ్ళీ తిరిగి పంచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ అలా పంచితే ఎలా ఉంటుందన్న ఊహతో రాసిన పాటే ఇది. అమ్మకు అమ్మవ్వడం, అక్షరాలు దిద్దించిన అమ్మకు పాఠాలు చెప్పడం.. అనే పదాలు ఇందులో కనిపిస్తాయి.
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
సువ్వీ సువ్వాలమ్మా - లోఫర్: తన కొడుకెవరో తెలుసుకోలేని ఓ అమ్మకు, నీ కొడుకును నేనేనమ్మా అంటూ గుర్తు చేసే పాట ఇది. సువ్వీ సువ్వాలమ్మా, నువ్వే గీసిందమ్మా మాట్టాడే ఈ బొమ్మ, నా తలపై సెయ్యే పెట్టి, నీ కడుపున పేగును అడుగు.. మనిద్దరి నడుమన ముడి ఏందో అని అక్షరాలు అమ్మకోసం పరితపించే బిడ్డ బాధను తెలియజేస్తాయి. ఎవరు రాయగలరు - అమ్మ రాజీనామా: అమ్మ కన్నా కమ్మని వాక్యం ఉంటుందా? అమ్మ కన్నా తీయని పాట ఉంటుందా? అని ప్రశ్నిస్తూ, మనకన్నీ అమ్మే అంటూ సాగుతుందీ ఈ పాట. అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని అనే మాట ఈ పాటలో హైలైట్ గా నిలుస్తుంది.