Ananya Nagalla : టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు తగిన గుర్తింపు లేదు: అనన్య నాగళ్ల
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. 'మల్లేశం', 'వకీల్ సాబ్' వంటి సినిమాలతో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆమె, నటన పరంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనన్య, తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బొంబాయి నుంచి వచ్చిన హీరోయిన్లకు లభించేంత వేగంగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని ఆమె స్పష్టంగా పేర్కొంది. 'నేను బొంబాయి నుంచి వచ్చానని చెప్పుంటే అవకాశాలు త్వరగా వచ్చేవేమో. కానీ ఇండస్ట్రీలో దీర్ఘకాలిక కెరీర్ కొనసాగించాలంటే మాత్రం తెలుగు అమ్మాయిలే సరైన ఎంపిక' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Details
గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధం
అలాగే 'వకీల్ సాబ్' వంటి పెద్ద సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని ఆశించినప్పటికీ, మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందని చెప్పింది. తనను కేవలం సంప్రదాయ పాత్రలకే పరిమితం చేయొద్దని, అవసరమైతే గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా తాను సిద్ధమేనని అనన్య స్పష్టం చేసింది. అందుకే సోషల్ మీడియాలో ఫోటోషూట్‌ల ద్వారా తన ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపింది. ఐదేళ్ల కెరీర్‌లో కరోనా కారణంగా రెండేళ్లు నష్టపోయినా, ప్రస్తుతం ఏకంగా ఏడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెబుతూ తన సత్తాను మరోసారి ఈ తెలుగు బ్యూటీ నిరూపిస్తోంది.