Ranabaali: 80 లక్షల మందిని బలిగొన్న కరవు.. 'రణబాలి' వెనుక అసలు కథ ఇదే?
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని చరిత్రలు పుస్తకాల్లోని పేజీలకే పరిమితమవుతాయి. మరికొన్ని మాత్రం తరాలు మారినా ప్రజల మనసులను వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి విషాద గాథల్లో 1876-78 మధ్య దక్షిణ భారతాన్ని కుదిపేసిన మద్రాస్ మహా కరవు (Madras Famine) ఒకటి. ఆ సమయంలో ఆకలి, అంటు వ్యాధులు, పేదరికం కారణంగా వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇదే చీకటి కాలాన్ని కథా నేపథ్యంగా తీసుకుని తెరకెక్కుతున్న సినిమా 'రణబాలి'.
వివరాలు
బ్రిటిష్ వారి దారుణ ప్రవర్తన..
1870ల మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలు వరుస కరవులతో విలవిల్లాడాయి. 1876లో రుతుపవనాల ప్రభావంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి.
నేటి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం కూడా ఈ విపత్తు ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంది. అప్పట్లో భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది.
స్థానిక ప్రజల అవసరాల కంటే ఆదాయ సేకరణ, వాణిజ్య ప్రయోజనాలకే బ్రిటిష్ పాలకులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
కరవు సహాయ కార్యక్రమాల నిర్వహణలో ఉన్న సర్ రిచర్డ్ టెంపుల్ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేలా కఠినమైన విధానాలను అమలు చేశారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి.
ఒకవైపు కరవు.. మరోవైపు బ్రిటిష్ వారి దారుణ ప్రవర్తన.. ఈ పరిస్థితుల కారణంగా దాదాపు 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు 'రణబాలి'టీజర్‌లో చూపించారు.
వివరాలు
తిరుగుబాటుగా మారిన ఆకలి కేకలు..
ఒక్క రాయలసీమలోనే దాదాపు ఏడు లక్షల మంది మరణించినట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి (Ranabaali Real Story).
ఒకవైపు ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే.. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం వారిపై చిత్రహింసలకు పాల్పడినట్లు కథనం సాగుతుంది.
కరవు కొనసాగుతున్నప్పటికీ పన్నుల వసూళ్లు ఆగలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అధికారాన్ని ఎదిరించారు. నిల్వ చేసిన ధాన్యాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. పన్నుల వసూళ్లను అడ్డుకున్నారు.
స్థానికంగా తిరుగుబాట్లు చోటుచేసుకున్నాయి. బ్రిటిష్ అధికారిక రికార్డుల్లో ఈ స్థానిక పోరాటాలకు పెద్దగా చోటు దక్కకపోయినా.. వాటి జ్ఞాపకాలు మాత్రం ప్రజల్లో నిలిచిపోయాయి.
ఆకలి, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా తమ ప్రాంత ప్రజల తరఫున నిలబడిన వ్యక్తులు జానపద కథల్లో ప్రతిఘటనకు ప్రతీకలుగా మారారు.
వివరాలు
పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా 'రణబాలి'
అలాంటి ఓ వ్యక్తి స్ఫూర్తితోనే విజయ్ దేవరకొండ పోషిస్తున్న రణబాలి పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది. 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం అంటే సాధారణ విషయం కాదు.
దాని వెనుక ఎన్నో కుటుంబాల విషాద గాథలు ఉన్నాయి. అందుకే 'రణబాలి'ని కేవలం ఓ పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా మాత్రమే చూడలేం.
ఒక విపత్తు మనిషి జీవితాన్ని ఎలా మార్చింది? అణచివేతకు గురైన ప్రజల్లో ప్రతిఘటన ఎలా పుట్టింది? తమ నేల కోసం, తమ మనుషుల కోసం కొందరు ఎందుకు తిరుగుబాటు బాట పట్టారు?
అనే ప్రశ్నలకు కథ రూపంలో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ (Ranabaali Director) సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
వివరాలు
రణబాలి.. ఓ వ్యక్తి కాదు.. పోరాట స్ఫూర్తి..
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రణబాలి పాత్రలో కనిపించనున్నారు.
తన ప్రాంత ప్రజలను కాపాడుతూ బ్రిటిష్ అధికారాన్ని ఎదుర్కొనే తిరుగుబాటు యోధుడిగా ఈ పాత్రను తీర్చిదిద్దారు.
ఒకవైపు ఆకలి, కష్టాలు.. మరోవైపు అధికారాన్ని ఎదిరించాల్సిన పరిస్థితి.. ఈ రెండింటి మధ్య రణబాలి ప్రయాణం సాగుతుంది.
అందుకే ఈ కథలో యాక్షన్‌తో పాటు ఆత్మగౌరవానికి కూడా పెద్దపీట వేశారు.
వివరాలు
జయమ్మగా రష్మిక
విజయ్ దేవరకొండ నిజ జీవిత భాగస్వామి రష్మిక (Rashmika) వెండితెరపై కూడా ఆయన భార్యగా కనిపించనున్నారు.
రణబాలి అర్ధాంగిగా, అతడి పోరాటంలో భాగస్వామిగా ఆమె పాత్రను చూపిస్తున్నారు.
చుట్టూ కష్టాలు, ప్రమాదాలు ఉన్నప్పటికీ తన మనిషి వెంటే నిలిచే మహిళగా జయమ్మ పాత్రను తీర్చిదిద్దారు. ఈ పాత్ర కథలో భావోద్వేగానికి మరింత బలం చేకూర్చనుంది.
వివరాలు
బ్రిటిష్ అధికారిగా హాలీవుడ్ నటుడు
హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లూ.. సర్ థియోడర్ హెక్టర్ అనే బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నారు.
రణబాలికి, ఈ అధికారికి మధ్య జరిగే సంఘర్షణే కథలో ప్రధాన ఘర్షణగా నిలవనుంది.
ఒకవైపు అధికార బలం.. మరోవైపు ప్రజల కోసం పోరాడే వ్యక్తి. వీరిద్దరి మధ్య ఎలాంటి పోరు జరిగిందనేది సినిమాలో చూపించనున్నారు.