siima awards 2024: అట్టహాసంగా జరిగిన 'సైమా 2024 అవార్డుల' వేడుక
2024 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక దుబాయ్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు, కన్నడ సినీ తారలు పాల్గొని సందడి చేశారు. ప్రముఖ నటీమణులు ప్రదర్శించిన డ్యాన్స్‌లు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సైమా తన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు నటీనటులు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. కీర్తి సురేశ్ 'దసరా' చిత్రానికి ఉత్తమ నటి అవార్డును పొందగా, నాని కూడా 'దసరా' చిత్రానికి ఉత్తమ నటుడిగా గెలిచారు.
ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి
మృణాళ్ ఠాకూర్ 'హాయ్ నాన్న' చిత్రానికి క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 'దసరా' చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఉత్తమ దర్శకుడిగా ఎంపికవ్వగా, సాయిరాజేశ్ ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) అవార్డును గెలుచుకున్నారు. 'భగవంత్ కేసరి' ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. అవార్డుల కార్యక్రమంలో నాని, రానా, విజయ్ దేవరకొండ వంటి నటులు ముచ్చట్లు పంచుకున్నారు. 'హాయ్ నాన్న' టీమ్, 'మ్యాడ్' సినిమాతో సంగీత్ శోభన్, దీక్షిత్ శెట్టి, కియారా ఖాన్ వంటి నటీనటులు కూడా అవార్డులు అందుకున్నారు.