నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు: చైతన్ కృష్ణ 'బ్రీత్' మూవీ టీజర్ విడుదల
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో వెండి తెరకు పరిచయం అవుతున్నారు. నందమూరి జయకృష్ణ కొడుకు, చైతన్య కృష్ణ బ్రీత్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు. బ్రీత్ సినిమా టీజర్ శనివారం విడుదలై ఆకట్టుకుంటోంది. మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని, పూర్తిగా హాస్పిటల్లోనే చిత్రీకరించినట్టు టీజర్‌లో అర్థమవుతోంది. టీజర్ మొత్తంలో కేవలం ఒకే ఒక్క డైలాగ్ ఉంది. అది కూడా చివర్లో ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న సన్నివేశాలు, వాటికి వచ్చే నేపథ్య సంగీతంతోనే టీజర్ ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా టాప్ పొజిషన్‌లో ఉన్నారు.
సొంత బ్యానర్ లో సినిమా
బ్రీత్ టీజర్‌లో అసలు కథేంటనేది వెల్లడి కాలేదు. కాకపోతే సీరియస్ సబ్జెక్ట్ అని, థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయని నేపథ్య సంగీతం ద్వారా అర్థమవుతోంది. సాధారణంగా మొదటి సినిమాకు సింపుల్ సబ్జెక్ట్ ఎంచుకుంటారు. లవ్ స్టోరీ లేదా యాక్షన్ ఎక్కువగా ఉండే కమర్షియల్ కథలను ఎంచుకుంటారు. కానీ చైతన్య కృష్ణ సీరియస్ సబ్జెక్టుతో వస్తున్నాడు. బసవతారక రామ క్రియేషన్స్ పేరుతో సొంత బ్యానర్ స్థాపించి బ్రీత్ సినిమాను నిర్మిస్తున్నారు. నందమూరి జయకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. మరి మొదటి సినిమాతో చైతన్య కృష్ణ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.