Yash: యశ్ ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు.. నటుడి తల్లి కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
తన కుమారుడు యశ్ ఉగ్రవాది కాదని, అతడి ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారని యశ్ తల్లి పుష్ప అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి. 'కేజీఎఫ్'కు ముందు యశ్ ఎవరు? అంటూ వచ్చిన వ్యాఖ్యలపై ఆమె పేరు ప్రస్తావించకుండా ఘాటుగా స్పందించారు. "కేజీఎఫ్‌కు ముందు యశ్‌కు వరుసగా ఐదు హిట్లు వచ్చాయి. మీరు అన్నట్లు అతడు అంత గుర్తింపులేని వాడు అయితే ఇప్పుడు అందరూ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. నా కుమారుడు ఉగ్రవాది కాదు. అతడు అందరిలా ధనిక కుటుంబంలో పుట్టలేదు. ఒక బస్ డ్రైవర్ కొడుకు, తన సొంత కృషితో ఉన్నత స్థాయికి ఎదిగాడు.
వివరాలు
పుష్ప తన వ్యాఖ్యల్లో ఎవరి పేరును నేరుగా ప్రస్తావించలేదు
ఒక తల్లిగా, నేను అతడిని చూసి గర్వపడుతున్నానని పుష్ప వ్యాఖ్యానించారు. యశ్ సాధించిన విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదని ఆమె స్పష్టం చేశారు.
'కేజీఎఫ్'కు ముందు కన్నడలో యశ్ పడిన కష్టానికి, చేసిన పోరాటానికి ఫలితంగానే ప్రస్తుతం ఆయన పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారని తెలిపారు.
అయితే పుష్ప తన వ్యాఖ్యల్లో ఎవరి పేరును నేరుగా ప్రస్తావించలేదు.
కానీ గతంలో 'కేజీఎఫ్'కు ముందు యశ్ ఎవరు? అంటూ వ్యాఖ్యలు చేసింది అల్లు అరవింద్ కావడంతో.. ఆమె వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించే చేసినవేనని పలువురు భావిస్తున్నారు.
వివరాలు
సినిమా విజయం కేవలం నటుడి వల్ల మాత్రమే సాధ్యం కాదు
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించిన విషయం తెలిసిందే.
ఒక సినిమా విజయం కేవలం నటుడి వల్ల మాత్రమే సాధ్యం కాదని, దాని వెనుక ఎంతో మంది సాంకేతిక నిపుణుల కష్టం ఉంటుందని ఆయన చెప్పారు.
అయితే ప్రధాన పాత్రలో నటించేవారు తమ పాత్రను సరిగ్గా చేయలేకపోతే.. ఆ సినిమా కచ్చితంగా హిట్ కాదని యశ్ పేర్కొన్నారు.