
Movie Ticket Rate : టికెట్ ధర రూ.200 మించకూడదు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక ప్రభుత్వం తాజాగా సినీ ప్రేమికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సినిమాలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో సినిమా టికెట్ ధరలపై నియంత్రణ విధించే దిశగా ముందడుగు వేసింది. ఈ మేరకు థియేటర్లపై ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా హాళ్లలో - సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు కలిపి టికెట్ ధర గరిష్టంగా రూ. 200కి మించకూడదని పేర్కొంది. దీన్ని అమలు చేసే ముందు, ఏవైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల వ్యవధిలో తెలియజేయాలని సూచించింది. ప్రజలందరికీ సినిమా అందుబాటులోకి రావాలి అనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Details
అభిప్రాయాలపై రెండు విధాల స్పందనలు
గతంలో మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు రూ.600 నుంచి రూ.1000 వరకూ పెరిగిన సందర్భాలు ఉండటంతో, సామాన్య ప్రేక్షకులకు సినిమా అనుభవం భారం అయిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నిర్ణయం పై ప్రజల్లో రెండు విధాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సామాన్యులు - ముఖ్యంగా మిడిల్ క్లాస్, కాలేజీ యువత సినిమాను మరింత సులభంగా ఆస్వాదించగలుగుతారనే ఉత్సాహంతో ఉన్నారు. అయితే మరోవైపు మల్టీప్లెక్స్ యజమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐమాక్స్, 4డిఎక్స్, లగ్జరీ స్క్రీన్ల వంటి ప్రీమియం ఫార్మాట్లు అందించేందుకు వారు భారీగా పెట్టుబడులు పెట్టారని, అందువల్ల అన్ని ఫార్మాట్లకూ ఒకే ధర విధించడం అన్యాయమని అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం తాలూకు ప్రభావం వారి ఆదాయంపై తీవ్రంగా పడనుందన్నది వారి వాదన.