Loading...
Tiger Shroff: టైగర్‌ ష్రాఫ్‌ అసలు టార్గెట్‌ కాదు.. గురిపెట్టింది ఆ స్టార్‌ హీరోనే!
టైగర్‌ ష్రాఫ్‌ అసలు టార్గెట్‌ కాదు.. గురిపెట్టింది ఆ స్టార్‌ హీరోనే!

Tiger Shroff: టైగర్‌ ష్రాఫ్‌ అసలు టార్గెట్‌ కాదు.. గురిపెట్టింది ఆ స్టార్‌ హీరోనే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాజాగా కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. షూటర్ల అసలు లక్ష్యం టైగర్‌ ష్రాఫ్‌ కాదని, మరో అగ్ర కథానాయకుడిపై దాడి చేయాలని తొలుత ప్రణాళిక వేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే చివరి నిమిషంలో తమ ప్లాన్‌ను మార్చుకున్నట్లు వెల్లడించాయి. ఈ కేసులో ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అసలు ఈ కాల్పుల ఘటన వెనుక ఏం జరిగింది? దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలివే..

వివరాలు

అసలు టార్గెట్‌ సల్మాన్‌ ఖాన్‌!

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ తొలుత బాలీవుడ్‌ అగ్ర నటుడు సల్మాన్‌ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఆయన నివాసం వద్ద నిందితులు ముందుగా రెక్కీ నిర్వహించినట్లు సమాచారం.

అయితే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండటాన్ని గమనించి దాడి ప్రణాళికను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

సల్మాన్‌ ఖాన్‌పై దాడి చేయడం సాధ్యం కాదని భావించిన నిందితులు.. ఆ తర్వాత టైగర్‌ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.

ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ముంబయిలోని సల్మాన్‌ ఖాన్‌ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఆయన ఇంటి లోపల, బయటతో పాటు రహదారికి ఇరువైపులా పోలీసు సిబ్బందిని మోహరించి పహారా కాస్తున్నారు.

వివరాలు

సోషల్‌ మీడియా రీల్స్‌ ద్వారా టైగర్‌ గురించి తెలుసుకుని..

సల్మాన్‌ ఖాన్‌పై దాడి చేయడం సాధ్యం కాదని భావించిన నిందితులు.. ఆ తర్వాత టైగర్‌ ష్రాఫ్‌ గురించి సమాచారం సేకరించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.

సోషల్‌ మీడియాలోని రీల్స్‌ ద్వారా ఆయనకు పోలీసు భద్రత తక్కువగా ఉందని తెలుసుకున్నట్లు సమాచారం.

అంతేకాకుండా టైగర్‌ ష్రాఫ్‌ ప్రతి ఆదివారం ముంబయిలోని జుహు ప్రాంతంలో ఉన్న ఫుట్‌బాల్‌ మైదానానికి వస్తుంటారని కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.

ఆయనకు భద్రత తక్కువగా ఉంటుందని భావించిన నిందితులు.. టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు జరిపినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, సల్మాన్‌ ఖాన్‌తో కలిసి పనిచేసే వారిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

ADVERTISEMENT

వివరాలు

ఆయుధాలు సరఫరా చేసిన ఇద్దరు మహిళలు అరెస్ట్‌!

టైగర్‌ ష్రాఫ్‌ కాల్పుల కేసులో ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని దిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.

వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. హరియాణాకు చెందిన కునాల్‌, సుమిత్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాధ, బబితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కునాల్‌ మొదట అమృత్‌సర్‌ నుంచి పిస్టల్‌, బుల్లెట్లను సేకరించాడు. అనంతరం రాధ సహాయంతో వాటిని ముంబయికి తరలించాడు.

అక్కడికి చేరుకున్న తర్వాత ఆయుధాలు ఉన్న బ్యాగ్‌ను ఓ మైనర్‌ బాలుడికి అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ వ్యవహారం వెనుక లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న అనిల్‌ పండిట్‌ పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

ADVERTISEMENT