LOADING...
Tollywood : ఉస్తాద్ భగత్ సింగ్ సహా పలు సినిమాలు లీక్.. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో కేసు నమోదు
ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో కేసు నమోదు

Tollywood : ఉస్తాద్ భగత్ సింగ్ సహా పలు సినిమాలు లీక్.. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు చలనచిత్ర పరిశ్రమను పైరసీ ముప్పు మళ్లీ వెంటాడుతోంది. థియేటర్లలో భారీ కలెక్షన్లు సాధిస్తున్న సినిమాలను కొన్ని అనధికార వెబ్‌సైట్లు అక్రమంగా లీక్ చేయడం టాలీవుడ్ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC)సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి అధికారిక ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో భాగంగా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన'రాజా సాబ్','మన శంకరవరప్రసాద్ గారు','అనగనగా ఒక రాజు','నారీనారీ నడుమ మురారి'సినిమాలతో పాటు తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం కూడా పైరసీకి గురైనట్లు వెల్లడైంది. ఆశ్చర్యకరంగా,విడుదలైన అదే రోజు సాయంత్రానికే ఈ సినిమాల హై క్వాలిటీ ప్రింట్లు పలు సైట్లలో అప్‌లోడ్ కావడం గమనార్హం.

వివరాలు 

నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో మొత్తం 7 వెబ్‌సైట్లను నిందితులుగా గుర్తించారు. వీటిలో మూవీరుల్జ్‌కు చెందిన 5 డొమైన్లు, సినీవుడ్‌కు చెందిన 1 సైట్, తమిళ్ ఎంవీకి చెందిన మరో 1 సైట్ ఉన్నాయి. ఈ వెబ్‌సైట్లు సినిమాలను హై క్వాలిటీతో అప్లోడ్ చేస్తూ నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం కలిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

వివరాలు 

లింకులను సోషల్ మీడియాలో షేర్ చేయడం నేరమన్న సైబర్ క్రైమ్

పైరసీని అరికట్టేందుకు ఈ సైట్లను బ్లాక్ చేసే చర్యలతో పాటు,వాటిని నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అంతేకాదు,పైరసీ సైట్లను వినియోగించడం లేదా వాటి లింకులను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా నేరమని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరించారు. చలనచిత్ర పరిశ్రమను రక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమాలు వీక్షించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసింది.

Advertisement