Bandla Ganesh: 'స్టార్ హీరో నన్ను చెప్పుతో కొట్టాడు'.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బండ్ల గణేశ్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో తన సంచలన వ్యాఖ్యలతో ప్రత్యేక గుర్తింపు పొందిన నిర్మాత బండ్ల గణేష్, సినిమా ఈవెంట్లు అయినా ఇతర కార్యక్రమాలు అయినా స్టేజ్‌పై మాట్లాడితే వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. తనదైన శైలిలో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకునే గణేశ్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో జరిగిన ఒక షాకింగ్ ఘటనను బయటపెట్టారు. ఓ స్టార్ హీరో తనను చెప్పుతో కొట్టాడని ఆయన వెల్లడించారు. అయితే ఆ సంఘటన తనలో పట్టుదలను పెంచిందని, అది తన జీవితానికి మలుపుగా మారిందని కూడా ఆయన చెప్పారు.
వివరాలు
భగవంతుడి మీద ఒట్టు - ఆ హీరో చెప్పుతో కొట్టాడు!
హెలికాప్టర్ ప్రమాదంలో హీరోయిన్ సౌందర్య మరణించిన రోజు ఆ ఘటన జరిగిందని బండ్ల గణేశ్ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం ఆ స్టార్ హీరో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారేమో తనకు తెలియదని చెప్పారు. ఆ సమయంలో ఆయన పక్కనే కూర్చొని ఉన్నానని, తన అలవాటు ప్రకారం "సార్, సార్" అని పలకరించగానే, ఎలాంటి కారణం లేకుండానే ఆ హీరో తనను చెప్పుతో కొట్టారని తెలిపారు. ఆ సమయంలో తన పక్కనే మరో హీరో కూడా ఉన్నారని ఆయన చెప్పారు. "భగవంతుడి మీద ఒట్టు, నేను చెప్పింది నిజం" అని గణేశ్ స్పష్టం చేశారు. అయితే ఆ సంఘటన జరిగిన మరుసటి రోజే ఆ హీరో తనకు సారీ చెప్పారని గణేశ్ వివరించారు.
వివరాలు
ఆ కోపమే నాకు వరంగా మారింది!
ఆ ఘటన తన జీవితంలో ఒక మలుపు అని బండ్ల గణేశ్ అన్నారు. ఆ రోజు ఆ హీరో తన కంటే బలవంతుడిగా ఉండటంతో ఆ పరిస్థితి జరిగిందని చెప్పారు. కానీ అదే సంఘటన తనలో పట్టుదలను పెంచిందని తెలిపారు. ఆ తర్వాత బయటకు వచ్చి కారు ఎక్కినప్పుడు, తన పక్కన ఉన్న వ్యక్తితో "ఈ రోజు గుర్తుపెట్టుకో... నా దగ్గర డబ్బు లేదనే కదా నన్ను అలా కొట్టాడు. కానీ ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపించకపోతే నా పేరు గణేశ్ కాదు" అని చెప్పినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు "ఆ హీరో ఎవరు?" అంటూ చర్చించుకుంటున్నారు.
వివరాలు
టెంపర్ ఇప్పుడొస్తే రూ.1000 కోట్లు ఖాయం!
ఇంటర్వ్యూలో మరో విషయాన్ని కూడా బండ్ల గణేశ్ పంచుకున్నారు. 2015లో జూనియర్ ఎన్టీఆర్‌తో నిర్మించిన టెంపర్ సినిమా గురించి మాట్లాడుతూ, ఆ కథను వక్కంతం వంశీ చెప్పగానే తనకు చాలా నచ్చిందని అన్నారు. వెంటనే ఆ కథను దర్శకుడు పూరి జగన్నాథ్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. కథ విన్న వెంటనే పూరి జగన్నాథ్ "గణేశ్, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది" అని అప్పుడే చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు. నిజంగానే ఆ సినిమా భారీ విజయాన్ని సాధించిందని తెలిపారు. ఒకవేళ అదే సినిమా ఇప్పటి కాలంలో విడుదలైతే రూ.1000 కోట్లు వసూలు చేసేదని ఆయన అభిప్రాయపడ్డారు.