Loading...
Star Heros: ఒకటికి రెండు సినిమాలతో అగ్ర తారల సందడి.. వరుస చిత్రాలతో ఫుల్ జోష్!
ఒకటికి రెండు సినిమాలతో అగ్ర తారల సందడి.. వరుస చిత్రాలతో ఫుల్ జోష్!

Star Heros: ఒకటికి రెండు సినిమాలతో అగ్ర తారల సందడి.. వరుస చిత్రాలతో ఫుల్ జోష్!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

''విరామం లేదు.. వరుస సినిమాలతో మా జోరు చూపిస్తాం'' అన్నట్లుగా అగ్ర కథానాయకులు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాదికి ఒక్క సినిమా చొప్పున సాగే తమ సినీ ప్రయాణానికి గేరు మార్చి వేగం పెంచుతున్నారు. నెలల వ్యవధిలోనే వరుసగా ఒకటికి రెండు సినిమాలతో ప్రేక్షకులకు వినోదాల విందు అందించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పుడు అదే జోష్‌తో దసరా బరిలో 'విశ్వంభర'తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఆ వెంటనే కేవలం మూడు నెలల వ్యవధిలోనే తన 158వ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారని సమాచారం.

వివరాలు

మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌..

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

ఈ సినిమాలో చిరంజీవి మునుపెన్నడూ కనిపించని సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నట్లు తెలుస్తోంది.

నవంబరు నాటికి షూటింగ్‌ను పూర్తి చేసి.. 2027 సంక్రాంతి బరిలో సినిమాను నిలపాలనే లక్ష్యంతో చిత్ర బృందం వేగంగా పనులు చేస్తోంది.

ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్న టైటిల్‌ టీజర్‌లోనే సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇక ఈ సంక్రాంతికి చిరంజీవి సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించిన విక్టరీ వెంకటేశ్‌ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు.

మూడునెలల వ్యవధిలోనే రెండు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

వివరాలు

బాక్సాఫీస్‌ బరిలో సందడి..

ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ నటిస్తున్న 'ఆదర్శ కుటుంబం: హౌస్‌ నెం 47' సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.

వినోదం, యాక్షన్‌, కుటుంబ భావోద్వేగాల కలయికగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబరు 2న థియేటర్లలోకి రానుంది.

మరోవైపు వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ కలయికలో అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

ఇలా అగ్ర కథానాయకులు వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతుండటంతో సినీప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT