Loading...
Mushtaq Khan: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ కమెడియన్ ముష్తాక్ ఖాన్ కన్నుమూత
బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ కమెడియన్ ముష్తాక్ ఖాన్ కన్నుమూత

Mushtaq Khan: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ కమెడియన్ ముష్తాక్ ఖాన్ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ వెటరన్ యాక్టర్, ప్రముఖ కమెడియన్ ముష్తాక్ ఖాన్ (Mushtaq Khan) కన్నుమూశారు. 56 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముష్తాక్ ఖాన్.. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 24న మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన బిజినెస్ పార్ట్‌నర్ శివమ్, ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు బీఎన్ తివారీ ధృవీకరించారు. ముష్తాక్ ఖాన్ గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన కన్నుమూశారు.

వివరాలు

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణం

1980లో 'ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యోం ఆతా హై' సినిమాతో ముష్తాక్ ఖాన్ తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన సినీ ప్రయాణంలో 200కు పైగా సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించారు.

'ఆషికీ', 'హమ్ హై రహీ ప్యార్ కే', 'హేరా ఫేరీ', 'జోడీ నెం. 1', 'గదర్: ఏక్ ప్రేమ్ కథ', 'ముజ్సే షాదీ కరోగి', 'వెల్కమ్', 'స్త్రీ 2' వంటి ఎన్నో హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా కామెడీ, సపోర్టింగ్ పాత్రల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

పాత్ర చిన్నదైనా.. ప్రతి సినిమాలోనూ తన ఉనికిని చాటుకునేలా నటించడం ముష్తాక్ ఖాన్ ప్రత్యేకతగా నిలిచింది.

వివరాలు

'వెల్కమ్'లో బల్లూ పాత్రతో ప్రత్యేక గుర్తింపు

ముష్తాక్ ఖాన్ నటించిన చిత్రాల్లో 'వెల్కమ్'కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో ఆయన పోషించిన బల్లూ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసింది.

అక్షయ్ కుమార్, నానా పటేకర్, అనిల్ కపూర్, కత్రినా కైఫ్ వంటి స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ.. ముష్తాక్ ఖాన్ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించారు.

ఈ సినిమాలో ఆయన నటించిన సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

అలాగే 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'లో గుల్ ఖాన్ పాత్రలో కనిపించిన ముష్తాక్ ఖాన్.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన 'గదర్ 2'లోనూ అదే పాత్రలో మరోసారి ప్రేక్షకులను అలరించారు.

ADVERTISEMENT

వివరాలు

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'జాట్'లోనూ నటన

ముష్తాక్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కిన 'జాట్' సినిమాలోనూ ఆయన నటించారు.

ఈ సినిమాతో పాటు తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు.

చివరగా 'భబీజీ ఘర్ పర్ హై! ఫన్ ఆన్ ది రన్', 'హమ్ ఆంగ్రెజోన్ కే జమానే కే జైలర్ హై' చిత్రాల్లో ముష్తాక్ ఖాన్ కనిపించారు.

ADVERTISEMENT

వివరాలు

2024లో కిడ్నాప్ కలకలం

2024లో ముష్తాక్ ఖాన్ కిడ్నాప్‌కు గురైన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.

ఓ ఈవెంట్ పేరుతో ఆయనను పిలిపించిన కొందరు దుండగులు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద ఆయనను కారులో ఎక్కించుకొని బిజ్నోర్‌కు తీసుకెళ్లారు.

అనంతరం అక్కడ ఆయనను బంధించి రూ.కోటి డబ్బులు డిమాండ్ చేశారు. దాదాపు 12 గంటల పాటు ముష్తాక్ ఖాన్‌ను చిత్రహింసలకు గురిచేశారు.

అయితే ఆయన వద్ద అంత పెద్ద మొత్తంలో డబ్బు లేదని కిడ్నాపర్లు తెలుసుకున్న తర్వాత చివరకు ఆయనను వదిలిపెట్టారు.

వివరాలు

సెప్టెంబర్ 25న అంత్యక్రియలు

ముష్తాక్ ఖాన్ మరణంతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మృతికి సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

నాలుగు దశాబ్దాల పాటు సినిమాలు, టీవీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ముష్తాక్ ఖాన్ ఇక లేరన్న వార్తతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 25న ముష్తాక్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ADVERTISEMENT