Amala Akkineni: అమల ప్రాణాలకు ముప్పు తెచ్చిన 'ఉల్లడక్కం' షూటింగ్.. దర్శకుడు కమల్ షాకింగ్ రివీల్!
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, అక్కినేని అమల, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌హిట్ చిత్రం 'ఉల్లడక్కం'. 1991లో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు గానూ మోహన్‌లాల్ ఉత్తమ నటుడిగా, దర్శకుడు కమల్ ఉత్తమ దర్శకుడిగా కేరళ రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ భయానక ఘటనను దర్శకుడు కమల్ తాజాగా 'వనిత' మ్యాగజైన్‌లో తన కాలమ్ ద్వారా వెల్లడించారు. హీరోయిన్ అమల సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఆ సంఘటనను తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు వణుకుతుందని ఆయన గుర్తుచేసుకున్నారు.
వివరాలు
అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో షూటింగ్
'ఉల్లడక్కం' సినిమాలో అమల 'రేష్మ' అనే మానసిక రోగి పాత్రలో నటించింది. కథ ప్రకారం.. రేష్మ ప్రియుడు సముద్రంలో పడిపోయే ఓ కీలకమైన ఎమోషనల్ సీన్‌ను చిత్రీకరించాల్సి వచ్చింది.
ఇందుకోసం ఓ సముద్ర తీరాన్ని ఎంచుకున్నారు. అయితే, ఆ రోజు సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. అలల ఉధృతి (హై టైడ్) ఎక్కువగా ఉండటంతో స్థానిక మత్స్యకారులు సినిమా బృందాన్ని ముందుగానే హెచ్చరించారు.
ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి, ఏదైనా జరిగితే రక్షించేందుకు ఆ జాలర్లు కూడా నీళ్లలో సిద్ధంగా నిలబడ్డారు.
వివరాలు
ఒక్కసారిగా ముంచెత్తిన భారీ అల
ఆ సీన్ కోసం అమల మానసికంగా పూర్తిగా తన పాత్రలో లీనమై సముద్రం వైపు చూస్తూ నిలబడింది.
పాత్రలోని తీవ్రతను ఆమె పూర్తిగా అర్థం చేసుకుని నటిస్తున్న తీరు చూసిన దర్శకుడు కమల్.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఆ తర్వాత కెమెరా రోల్ చేసి ఆయన 'యాక్షన్' చెప్పగానే ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది.
ఒక్కసారిగా భారీ రాకాసి అల వచ్చి అక్కడున్న వారిని ముంచెత్తింది. ఆ అల ధాటికి అమలతో పాటు అక్కడున్న కెమెరా కూడా సముద్రంలోకి కొట్టుకుపోయింది.
క్షణాల్లో జరిగిన ఈ పరిణామంతో సెట్స్‌లో ఉన్నవారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.
వివరాలు
ప్రాణాలకు తెగించి అమలను కాపాడిన జాలర్లు
అదృష్టవశాత్తూ అక్కడే అప్రమత్తంగా ఉన్న మత్స్యకారులు వెంటనే నీళ్లలోకి దూకారు. ప్రాణాలకు తెగించి అమలను రక్షించి ఒడ్డుకు చేర్చారు.
మరోవైపు నీళ్లలో మునిగిపోతున్న కెమెరా అసిస్టెంట్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కెమెరాను కాపాడేందుకు ప్రయత్నించాడు.
తన సొంత బిడ్డను కాపాడుకున్నట్లుగా ఆ కెమెరాను నీళ్లపైకి ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే యూనిట్ సభ్యులు అక్కడికి చేరుకుని అతడిని, కెమెరాను బయటకు లాగారు.
ఈ ప్రమాదం నుంచి అమల ప్రాణాలతో బయటపడటం దేవుడి దయేనని దర్శకుడు కమల్ గుర్తుచేసుకున్నారు.
వివరాలు
అమల నటనకు దర్శకుడి ప్రశంసలు
కేవలం సముద్రంలో చిత్రీకరించిన సన్నివేశంలోనే కాకుండా.. మానసిక వైద్యశాలలో డాక్టర్ ముందు అమల నటించిన తీరును చూసి సెట్‌లోని వారంతా ఆశ్చర్యపోయారని కమల్ తెలిపారు.
'కట్' చెప్పిన తర్వాత కూడా ఆమె ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టేదని చెప్పారు. పాత్ర కోసం అమల చూపించిన అంకితభావాన్ని ప్రశంసించారు.
ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక బృందం కృషి వల్లే దశాబ్దాలు గడిచినా 'ఉల్లడక్కం' ఓ క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయిందని కమల్ గుర్తుచేసుకున్నారు.