Lenin: 'లెనిన్' సక్సెస్ వేడుకలో తమన్ సర్‌ప్రైజ్.. జూలై 15న కొత్త పాట విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయపథంలో దూసుకెళ్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా రూ.61.1కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అఖిల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచిన ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. థియేటర్లలో ఆక్యుపెన్సీ కూడా బలంగానే కొనసాగుతోంది. గత 24 గంటల్లోనే బుక్‌మైషోలో 74వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం సినిమాపై నెలకొన్న క్రేజ్‌కు నిదర్శనంగా మారింది. ఇదేజోరు కొనసాగితే తొలి వారంలోనే 'లెనిన్'మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
గుంటూరులో 'లెనిన్' గ్రాండ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్
ఈ విజయానికి అఖిల్ నటనతో పాటు సంగీత దర్శకుడు ఎస్.థమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా ప్రధాన బలంగా నిలిచిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఉత్కంఠను తీసుకువచ్చిందని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే సినిమాలో వినిపించకుండా మిగిలిపోయిన ఓ పాటపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అభిమానుల కోరికను దృష్టిలో పెట్టుకున్న థమన్ కీలక ప్రకటన చేశారు.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆ అన్‌రిలీజ్డ్ సాంగ్‌ను 2026 జూలై 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
గుంటూరులో నిర్వహించనున్న'లెనిన్' గ్రాండ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ వేదికపైనే ఈ పాటను తొలిసారిగా అభిమానుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
దీంతో ఈవేడుకపై అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
వివరాలు
గ్రాండ్ సక్సెస్ వేడుకకు చిత్రబృందం
ఈ గ్రాండ్ సక్సెస్ వేడుకకు చిత్రబృందం మొత్తం హాజరుకానుంది.
అక్కినేని నాగార్జున, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, ఈశ్వరి రావు, బ్రహ్మాజీతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారీ స్థాయిలో నిర్వహించనున్న ఈ వేడుకలో కొత్త పాట విడుదల ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన 'లెనిన్'కు ఈ సక్సెస్ సెలబ్రేషన్ మరో ప్రత్యేక హైలైట్ కానుంది.