Ustaad bhagat singh : ఓటీటీలోకి పవన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం ఏప్రిల్ 16 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. ఇంతకు ముందు దీని డిజిటల్ విడుదలపై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వాటన్నిటికి ముగింపు పలుకుతూ నెట్‌ఫ్లిక్స్ తాజాగా అధికారికంగా ప్రకటన చేసింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్, తమన్ సంగీతాన్ని అందించారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు.
వివరాలు
కథ సాగుతుందిలా..
నల్లమల అరణ్యాల సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చంద్రశేఖర్ రావు (కె.ఎస్. రవికుమార్) అనే ఉపాధ్యాయుడు బోధన కోసం వస్తాడు. అక్కడి ప్రజల అభ్యున్నతికి తన జీతం మాత్రమే కాకుండా తన జీవితాన్నే అంకితం చేస్తాడు. కూలి పనులకు వెళ్లే పిల్లలు మళ్లీ చదువుల వైపు మళ్లేలా ప్రోత్సహించి, పాఠశాలకు తీసుకువస్తాడు. అదే గ్రామంలో జన్మించి అనాథగా పెరిగిన చిన్నయ్య అనే బాలుడిని దగ్గరకు తీసుకుని, అతనికి సంరక్షకుడిగా మారి విద్య నేర్పిస్తాడు. ఆ బాలుడి ఆలోచనలు, అతని ఉత్సాహాన్ని గమనించి అతనికి 'భగత్ సింగ్' అని పేరు పెడతాడు. తన తండ్రిని 'ఉస్తాద్' అని పిలిచేవారని చెప్పుకుంటూ, తన పేరును 'ఉస్తాద్ భగత్ సింగ్'గా పరిచయం చేసుకుంటాడు ఆ బాలుడు.
వివరాలు
ఆ అంశాల చుట్టూ కథ..
అనంతరం సేవాభావం గల ఆ ఉపాధ్యాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రిగా ఎదుగుతాడు. ఇక చిన్ననాటి ఉస్తాద్ భగత్ సింగ్ పెద్దయ్యాక ఏసీపీగా (పవన్ కళ్యాణ్) మారుతాడు. ముఖ్యమంత్రిగా ఉన్న తన గురువుకు ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తూ ఉంటాడు. అయితే అసాంఘిక శక్తులతో అనుబంధం కలిగిన చెదలమర్రి నల్లనాగప్ప (పార్తిబన్) ముఖ్యమంత్రి పదవిపై కన్నేస్తాడు. చంద్రశేఖర్ రావును హతమార్చేందుకు కుట్ర పన్నుతాడు. అలాంటి పరిస్థితుల్లో నల్లనాగప్పను ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఎదుర్కొన్నాడు? అతని జీవితంలోకి వచ్చిన లీల (శ్రీలీల), శ్లోక (రాశీ ఖన్నా) ఎవరు? అనే అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది.