Women's Day Special: ఉమెన్స్ డే స్పెషల్.. తెలుగు తెరపై నిలిచిపోయిన మహిళా ప్రాధాన్యత సినిమాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా కమర్షియల్ సినిమాల ఫార్ములా బయటకు వెళ్లేందుకు దర్శక నిర్మాతలు ఆలోచించడమే భయపడుతుంటారు.
కానీ అలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని సినిమా ప్రయోగాలు వెలుగులోకొచ్చాయి. మహిళా శక్తిని ప్రదర్శించే చిత్రాలు అడపాదడపా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇందులో కొన్ని భారీ విజయాలు సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాల్లో నటించిన కథానాయికలు తమ నటనతో వెండితెరపై చెరగని ముద్ర వేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (ఆదివారం) సందర్భంగా, ఈ గొప్ప చిత్రాల గురించి ఓ ప్రత్యేక కథనం.
Details
సితార (1984)
1984లో విడుదలైన 'సితార' ఒక రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో భానుప్రియ నటన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, సంగీతాన్ని ఇళయరాజా అందించారు. ఇందులో సుమన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించారు.
కర్తవ్యం (1990)
రాజకీయ, యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయశాంతి నటనకు చక్కటి ఉదాహరణ.
లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 1990లో విడుదలైంది.
పరుచూరి బ్రదర్స్ కథ అందించగా, మోహన గాంధీ దర్శకత్వం వహించారు. ఇందులో విజయశాంతి ప్రదర్శించిన పవర్‌ఫుల్ నటనకు జాతీయ అవార్డు లభించింది.
Details
ఒసేయ్ రాములమ్మ (1997)
ఇంకొక విజయశాంతి హిట్ చిత్రం 'ఒసేయ్ రాములమ్మ'. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, భూస్వాముల కాలంలో మహిళల పట్ల జరిగిన అన్యాయాలను కళ్లకు కట్టినట్టు చూపించింది.
ఈ సినిమాలో సూపర్‌స్టార్ కృష్ణ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.
ప్రతిఘటన (1990)
ఈ చిత్రంలో గృహిణిగా నటించిన విజయశాంతి, రాజకీయ పార్టీ అండతో అక్రమాలకు పాల్పడే గూండాల వల్ల ఎలా నష్టపోయింది? ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.
నడిరోడ్డుపై జరిగే హృదయవిదారక సంఘటన, ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న కష్టాలు, చివరకు సమాజంలో మార్పు తెచ్చే విధానం ఇవన్నీ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాయి.
Details
మయూరి (1985)
నాట్యకారిణి సుధా చంద్రన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'మయూరి'. ఈ చిత్రంలో ఆమె స్వయంగా నటించి ప్రేక్షకులను అలరించింది.
ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతాన్ని అందించగా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు 14 నంది అవార్డులు రావడం గమనార్హం.
అంతఃపురం (1998)
ఫ్యాక్షన్ మరియు ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సౌందర్య ప్రధాన పాత్ర పోషించి అందరి మన్ననలు పొందింది.
సాయికుమార్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. మానవ సంబంధాలను సున్నితంగా చిత్రీకరించిన దర్శకుడు కృష్ణవంశీ, ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందించారు.
Details
అరుంధతి (2009)
అనుష్క శెట్టి అంటే 'అరుంధతి', 'అరుంధతి' అంటే అనుష్క అనేలా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.
రౌద్రమైన కళ్లు, గంభీరమైన హావభావాలు, విభిన్నమైన పాత్ర చిత్రణతో అనుష్క అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంతోనే ఆమె మహిళా ప్రాధాన్యత గల సినిమాలకు మార్గదర్శిగా మారింది.
కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విలన్‌గా నటించిన సోనూసూద్ ఇప్పటికీ పశుపతి పాత్రతో గుర్తుండిపోయాడు.
రుద్రమదేవి (2015)
తెలుగు చరిత్రలో ప్రముఖ యోధురాలు రాణి రుద్రమదేవి జీవితాన్ని ఆధారంగా తీసిన 3D చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో అనుష్క రుద్రమదేవిగా ఆకట్టుకుంది. రానా, అల్లు అర్జున్, నిత్యామేనన్, సీనియర్ నటుడు కృష్ణంరాజు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
Detals
మహిళా ప్రాధాన్యత గల సినిమాలు - ఒక మార్గదర్శక మార్పు
నేటితరం హీరోయిన్లలో అనుష్క శెట్టితోనే మహిళా ప్రాధాన్యత గల సినిమాలకు కొత్తదారి తెరచిందని చెప్పుకోవచ్చు.
వీటితో పాటు మరెన్నో చిత్రాలు మహిళా శక్తిని చూపిస్తూ విజయవంతమయ్యాయి.
సమాజంలో మహిళల స్థానం, వారి పోరాటం, శక్తిని చాటే ఇలాంటి చిత్రాలు మరింత ముందుకు రావాలని ఆశిద్దాం!