కన్నప్ప: 600మంది యూనిట్ తో న్యూజిలాండ్ బయలు దేరిన మంచు విష్ణు
తెలుగు సినిమా హీరోలందరూ పాన్ ఇండియా హీరోలుగా మారుతున్నారు. తాము చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. తాజాగా హీరో మంచు విష్ణు కన్నప్ప సినిమాను లాంచ్ చేశాడు. 150కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా షూటింగ్ మొదలైందని మంచు విష్ణు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడి చేశారు. కన్నప్ప సినిమా ఐడియాను నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఏడేళ్ళ క్రితం తనకు చెప్పారని, తనకు బాగా నచ్చేసిందని మంచు విష్ణు అన్నారు.
న్యూజిలాండ్ లో కన్నప్ప షూటింగ్
ఏడేళ్లుగా ఆ కథపై ఎంతోమంది పనిచేశారని, కన్నప్ప కథా రచనలో, విజయేంద్రప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, తోటపల్లి సాయినాథ్, తోట ప్రసాద్, నాగేశ్వరరావు రెడ్డి, ఈశ్వర్ రెడ్డి మొదలగు వారందరూ పాల్గొన్నారని మంచు విష్ణు తెలియజేశారు. 600మంది యూనిట్ తో న్యూజిలాండ్ లో కన్నప్ప సినిమా రూపుదిద్దుకుంటుందని, మరికొద్ది రోజుల్లో కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని, కన్నప్ప సినిమాకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడి చేస్తానని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఆవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న కన్నప్ప సినిమాను హిందీలో మహాభారతం సీరియల్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.