Loading...
Ananthika Sanilkumar: 'ఎల్లమ్మ'లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
'ఎల్లమ్మ'లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?

Ananthika Sanilkumar: 'ఎల్లమ్మ'లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 29, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో తన తొలి సినిమా 'బలగం'తో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఎల్లమ్మ'. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారనే విషయంపై ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మ్యాడ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనంతిక సనిల్‌కుమార్.. '8 వసంతాలు' చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బుట్టబొమ్మ 'ఎల్లమ్మ' సినిమాలో హీరోయిన్‌గా నటించడం దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.

వివరాలు

గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా..

అంతేకాదు.. దేవి శ్రీ ప్రసాద్, అనంతిక సనిల్‌కుమార్‌పై మేకర్స్ ఇప్పటికే ఫొటోషూట్ కూడా నిర్వహించినట్లు సమాచారం.

అయితే హీరోయిన్‌గా అనంతిక ఎంపికపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక 'ఎల్లమ్మ' కథ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఎల్లమ్మ దేవిని నమ్ముకుని సంప్రదాయ జానపద కళలను ప్రదర్శించే ఓ కళాకారుల బృందం ఎదుర్కొనే కష్టాలు, వారి జీవన పోరాటాలు, భావోద్వేగాల చుట్టూనే ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం.

'బలగం' తరహాలోనే పల్లెటూరి నేటివిటీతో పాటు బలమైన భావోద్వేగాలను ఈ సినిమాలో వేణు యెల్దండి చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే విడుదలైన దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

వివరాలు

సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు..

రగ్గడ్ హెయిర్‌స్టైల్, గడ్డంతో డీఎస్పీ కనిపించిన ఇంటెన్స్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సంగీత దర్శకుడిగా ఎన్నో సూపర్‌హిట్స్ అందుకున్న దేవి శ్రీ ప్రసాద్.. 'ఎల్లమ్మ'తో హీరోగా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

హీరోయిన్‌గా అనంతిక సనిల్‌కుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు వస్తున్న వార్తలపై చిత్రబృందం అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తుందో చూడాలి.

ప్రస్తుతం అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్‌గా, సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'రోమాంచకం' సినిమాతో సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ADVERTISEMENT