2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి
భారతదేశం 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజా డేటా ప్రకారం ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది వ్యక్తులు గాయపడ్డారు. 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6% పెరిగాయి. ఏడాదిలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు 16.9%, గాయాలు 10.39%గా నమోదు అయ్యాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 1,28,825 జాతీయ రహదారులపై (ఎక్స్‌ప్రెస్‌వేలతో సహా) జరిగితే, 96,382 రాష్ట్ర రహదారులపై, 1,87,225 ఇతర రహదారులపై జరిగినట్లు MORTH తన వార్షిక నివేదిక 'భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు - 2021'లో పేర్కొంది. 18-45 ఏళ్ల వయస్సు వారు ప్రమాదాల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యారు, దాదాపు 67% మరణించారు.
ప్రమాదాలకు రహదారి రూపకల్పనలో లోపాలు కూడా కారణం
2021లో అతివేగంతో 1,07,236 మంది,మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 3,314 మంది మరణించారు. లేన్ క్రమశిక్షణారాహిత్యం కారణంగా 8,122 మంది, ట్రాఫిక్ లైట్లను ఉల్లంఘించిన కారణంగా 679 మంది మరణించారు. డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్‌లు ఉపయోగించడం వల్ల 2,982 మంది, ఇతర కారణాల వల్ల 31,639 మంది మరణించారు. అతివేగం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటి మానవ తప్పిదాలే కాకుండా, రహదారి రూపకల్పనలో లోపాలు కూడా ఈ ప్రమాదాలకు కారణమని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై మరణించిన 10 మందిలో కనీసం ఒకరు భారతదేశానికి చెందినవారు. రహదారి భద్రత అనేది ఒక ప్రధాన అభివృద్ధి సమస్యగా, ప్రజారోగ్య సమస్యగా మారిందని పలువురు అభిప్రాయపడ్డారు.