CM Vijay: ఒక్క పైసాకే 1 గ్రాము బంగారం.. సీఎం విజయ్ పథకంలో అసలు ట్విస్ట్ ఏంటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ప్రభుత్వం నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరం అందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 'తై మామన్ తంగ మోదిరమ్' (మేనమామ బంగారు ఉంగరం) పథకం టెండర్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తం 4,41,667 బంగారు ఉంగరాల కొనుగోలుకు రూ.755.83 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం టెండర్ పిలిచింది. ఇందులో 11 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. అయితే.. టెండర్‌లో ప్రముఖ జువెలరీ సంస్థ జోయ్ అలుక్కాస్ చేసిన కోట్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. బంగారం ధరను మినహాయించి.. ఉంగరాల తయారీ, వేస్టేజ్, హాల్‌మార్కింగ్, బీమా, రవాణా తదితర అన్ని అదనపు ఖర్చులకు కలిపి సంస్థ కేవలం ఒక్క పైసా (రూ.0.01) మాత్రమే కోట్ చేసింది.
వివరాలు
బంగారం ధర ప్రభుత్వానిదే
టెండర్ నిబంధనల ప్రకారం ఉంగరాల్లో ఉపయోగించే అసలు బంగారం ధరను ప్రభుత్వం విడిగా చెల్లిస్తుంది.
ఇందుకోసం అప్పటి IBJA(ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్) మార్కెట్ రేటును ప్రాతిపదికగా తీసుకుంటారు. అందువల్ల పోటీ ప్రధానంగా తయారీ, రవాణా, బీమా, హాల్‌మార్కింగ్ వంటి సర్వీస్ ఛార్జీలపైనే జరిగింది.
ఈ పోటీలో జోయ్ అలుక్కాస్ అత్యల్ప ధరను కోట్ చేసి L1గా నిలిచింది. నిబంధనల ప్రకారం L1 ధరకు సరఫరా చేసేందుకు మిగిలిన సంస్థలకు అవకాశం కల్పించగా.. కల్యాణ్ జువెల్లర్స్ కూడా ఒక్క పైసా ధరకు సరఫరా చేసేందుకు అంగీకరించింది.
దీంతో ప్రభుత్వం మొత్తం ఆర్డర్‌ను రెండు సంస్థలకు కేటాయించింది. జోయ్ అలుక్కాస్‌కు 70 శాతం, కల్యాణ్ జువెల్లర్స్‌కు 30 శాతం ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించింది.
వివరాలు
ఒక్క పైసాకే ఇంత సేవ ఎలా?
టెండర్ ప్రక్రియపై ప్రతిపక్ష డీఎంకే సహా పలు వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఉంగరాల తయారీతో పాటు రవాణా, బీమా, హాల్‌మార్కింగ్ వంటి ఖర్చులు ఉన్నప్పటికీ కేవలం ఒక్క పైసాకే సంస్థలు ఈ సేవలను ఎలా అందిస్తాయనేది ప్రధాన ప్రశ్నగా మారింది.
వ్యాపార ప్రయోజనం లేకుండా లేదా భవిష్యత్తులో వేరే రూపంలో లాభం పొందే అవకాశం లేకుండా ఇంత తక్కువ ధరకు సరఫరా చేయడం సాధ్యమేనా? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
రూ.755 కోట్లకు పైగా విలువైన పథకంలో ఈ ఒక్క పైసా కోట్ వెనుక అసలు కారణమేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
వివరాలు
సామాజిక బాధ్యతగా చేస్తున్నాం: సంస్థలు
అయితే టెండర్ దక్కించుకున్న సంస్థల ప్రతినిధులు ఈ ఆరోపణలను ఖండించారు.
ఇది ప్రజాసంక్షేమ పథకమని, ఎలాంటి వ్యాపార లాభాలను ఆశించకుండా సామాజిక బాధ్యతగా ఈ సేవను అందించేందుకు ముందుకొచ్చామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం కూడా టెండర్ నిబంధనలకు అనుగుణంగానే అత్యంత పారదర్శకంగా L1 ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరణ ఇచ్చింది.
అసలు బంగారం ఖర్చును ప్రభుత్వమే భరిస్తున్నందున.. అదనపు సేవలపై పోటీ జరిగినట్లు పేర్కొంది.
అయితే భారీ విలువైన ఈ పథకంలో తయారీ, రవాణా, బీమా, హాల్‌మార్కింగ్ వంటి ఖర్చులను ఒక్క పైసాకే భరించేందుకు సంస్థలు ముందుకు రావడం వెనుక ఉన్న కారణాలను పూర్తిగా వివరించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.