Loading...
Nallamala Sagar: వెలిగొండ నుంచి 10.7 టీఎంసీల కృష్ణా జలాలు.. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడపకు భారీ ప్రయోజనం!
వెలిగొండ నుంచి 10.7 టీఎంసీల కృష్ణా జలాలు.. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడపకు భారీ ప్రయోజనం!

Nallamala Sagar: వెలిగొండ నుంచి 10.7 టీఎంసీల కృష్ణా జలాలు.. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడపకు భారీ ప్రయోజనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రయోజనాలను అందించడంలో భాగంగా వెలిగొండ సొరంగాల నుంచి 10.7 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు మళ్లించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ నీటితో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల భవిష్యత్తులో కీలక మార్పులు రానున్నాయని అన్నారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి రామానాయుడు విలేకర్లతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబే శంకుస్థాపన చేశారని, మూడు దశాబ్దాల తర్వాత ఆయనే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు.

వివరాలు

పరిహారం చెల్లించిన తర్వాతే నీరు విడుదల

వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లించిన తర్వాతే నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి చెప్పారు.

నిర్వాసితుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.2,250కోట్ల పరిహారం చెల్లించినట్లు రామానాయుడు వెల్లడించారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు పూర్తికాకముందే అప్పటి సీఎం జగన్‌ వెలిగొండను జాతికి అంకితం చేశారని, తద్వారా ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని మంత్రి ఆరోపించారు.

ఎల్‌నినో వంటి క్లిష్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ నల్లమలసాగర్‌కు 10.7 టీఎంసీల కృష్ణా జలాలను తీసుకురాగలుగుతున్నామని చెప్పారు. ఇందుకు సీఎం చంద్రబాబు ముందుచూపే కారణమని రామానాయుడు పేర్కొన్నారు.

ADVERTISEMENT