LOADING...
Pericherla Satyavani: శ్రీరామనవమి సందర్భంగా రామ కల్యాణానికి 108 రకాల సారె
శ్రీరామనవమి సందర్భంగా రామ కల్యాణానికి 108 రకాల సారె

Pericherla Satyavani: శ్రీరామనవమి సందర్భంగా రామ కల్యాణానికి 108 రకాల సారె

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగునాట పెళ్లి అంటే అంగరంగ వైభోగమే. ఎంత ఘనంగా జరిగినా వధూవరుల అందచందాల కంటే ఎక్కువగా చర్చ పెట్టుపోతలు, సారె గురించే జరుగుతుంది. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో 'సారె' పెట్టడాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఘనమైన సారెలకు ఆ ప్రాంతం ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఇది కేవలం మనుషులకే పరిమితం కాదు. దేవుళ్లకూ అదే భక్తి, అదే వైభవంతో సారె సమర్పిస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరానికి చెందిన పేరిచర్ల సత్యవాణి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహిస్తూ, ఏకంగా 108 రకాలతో సారె సమర్పించడం ఆమె ప్రత్యేకత.

వివరాలు

రామనవమి సందడి ముందుగానే

రాములోరి కల్యాణం అంటే లోకకల్యాణం అన్న భావనతో ప్రతి ఇంటిలోనూ రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. తోరణాలు కట్టడం నుంచి తలంబ్రాలు కలపడం వరకు అందరూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సత్యవాణి ఇంట్లో రామనవమి సందడి పదిహేను రోజుల ముందే ప్రారంభమవుతుంది. ఆమెకు శ్రీరాముడిపై ఉన్న భక్తి ఈ ఏర్పాట్లలో ప్రతిఫలిస్తుంది.

వివరాలు

108 రకాల సారె ప్రత్యేకత

కోనసీమలో సారెకు ఉన్న ప్రాముఖ్యతను మరింతగా నిలబెట్టేలా, సత్యవాణి 108 రకాలతో సారె సిద్ధం చేస్తారు. ఇది ఒక్క ఏడాది కాదు, గత 18 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అరిసెలు, బూరెలు, జంతికలు వంటి పిండివంటలతో పాటు పండ్లతో అలంకరించిన ఈ 'కంత' (సారె) చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా 300 లీటర్ల పాలతో కోవా తయారు చేసి, దానితో పట్టుచీరలు, కూరగాయలు, తిరగలి, సాన, పండ్లు, బొమ్మలు వంటి ఆకృతులను తయారు చేస్తారు. ఇవన్నీ సహజసిద్ధంగా కనిపించేలా రూపొందించడం ఈ సారెకు మరింత ప్రత్యేకతను ఇస్తుంది.

Advertisement

వివరాలు

సొంతంగా తయారీ

ఈ సారెలన్నీ సత్యవాణి ఇంటివద్దే తయారు చేస్తారు. ఆమెకు తోటిమహిళలు సహాయం చేస్తారు. త్రేతాయుగంలో క్షత్రియ వంశీయుల ఆచారాలను అనుసరిస్తూ, శ్రీరామనవమి రోజున వరుడు శ్రీరాముడి తరఫున సీతమ్మకు ఈ సారెను సమర్పిస్తారు. ఈ సమర్పణను చూసి రాములవారు సంతోషిస్తారని భక్తుల నమ్మకం

Advertisement

వివరాలు

ఆలయ ఉత్సవాలు వైభవంగా

వైనతేయ గోదావరి తీరంలో పూర్వికులు నిర్మించిన పట్టాభి రామాలయంలో సత్యవాణి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రత్యేకంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేసి, కల్యాణం రోజున భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తారు. భద్రాచలం తరహాలోనే ఇక్కడ కూడా శ్రీరామనవమి ఉత్సవాలను పుష్పయాగం వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కేవలం కల్యాణాన్ని మాత్రమే కాకుండా, సత్యవాణి సమర్పించే సారెను చూడటానికీ చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ప్రసాదంగా సారె పంపిణీ కల్యాణం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు ఈ సారెను కూడా భక్తులకు పంచిపెడతారు. ఈ సంప్రదాయాన్ని ఇంతకాలం కొనసాగించడంలో తన భర్త పేరిచర్ల భీమరాజు ప్రోత్సాహం ఎంతో ఉందని సత్యవాణి చెబుతున్నారు.

Advertisement