NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు 13.65 లక్షల దరఖాస్తులు
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్టీఆర్ భరోసా పింఛను పథకానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13.65 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో వృద్ధాప్య పింఛన్లకు 6.88 లక్షలు, వితంతు పింఛన్లకు 2.97 లక్షలు, దివ్యాంగ పింఛన్లకు 1.81 లక్షల దరఖాస్తులు వచ్చాయి. చేనేత కార్మికుల పింఛన్లకు 21,565, కల్లుగీత కార్మికులకు 16,430, మత్స్యకారులకు 31,825, ఒంటరి మహిళలకు 9,201, డప్పు కళాకారులకు 50,972, చర్మకారులకు 67,853, హిజ్రాల కేటగిరీలో 800 దరఖాస్తులు నమోదయ్యాయి.
వివరాలు
ఆరంచెల పరిశీలన పూర్తి
పింఛన్ల దరఖాస్తులపై ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ స్థాయిలో నిర్వహించిన ఆరంచెల పరిశీలన ప్రక్రియ ఆదివారంతో పూర్తయింది.
వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, మత్స్యకారులు, చేనేత కేటగిరీలకు సంబంధించిన దరఖాస్తుల్లో 1.42 లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు.
ఇందులో వృద్ధాప్య పింఛన్లకు 99,615, మత్స్యకార పింఛన్లకు 2,173, ఒంటరి మహిళల పింఛన్లకు 659, చేనేత పింఛన్లకు 1,953 మంది అనర్హులుగా తేలారు.
ఈ దరఖాస్తులను రాష్ట్రస్థాయి అధికారులు బ్యాక్‌ఎండ్‌లో మరోసారి పరిశీలించనున్నారు.
వివరాలు
వితంతు పింఛన్లకు భారీగా దరఖాస్తులు
వితంతు పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పౌజ్ కేటగిరీ కింద వితంతు పింఛన్లను నెలనెలా అందిస్తోంది.
పింఛను పొందుతున్న భర్త మరణిస్తే.. ఆయన భార్యకు ఈ కేటగిరీలో పింఛను మంజూరు చేస్తారు.
ఇప్పటివరకు ఈ విధానంలో 2.30 లక్షల మందికి పింఛన్లు అందించారు.
2019 మే నుంచి 2024 మే వరకు వైకాపా ప్రభుత్వ హయాంలో 72,991 మందికి స్పౌజ్ కేటగిరీలో పింఛన్లు అందగా.. 2024 జూన్ నుంచి 2026 ఆగస్టు వరకు 1,57,927 మందికి అందించారు.
వివరాలు
వితంతు పింఛన్లకు భారీగా దరఖాస్తులు
తాజాగా వితంతు పింఛను కోసం 2.97 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2014కి ముందు భర్తలను కోల్పోయిన వారు 32,504 మంది ఉన్నారు.
2014-19 మధ్య భర్తలను కోల్పోయిన వారు 23,249 మంది, 2020-24 మధ్య భర్తలను కోల్పోయిన వారు 1,30,190 మంది, 2025-26 మధ్య భర్తలను కోల్పోయిన వారు 1,10,800 మంది ఉన్నారు.
తాజా దరఖాస్తుల్లో దాదాపు 38,121 మంది అనర్హులుగా అధికారులు గుర్తించారు.
మరో 49 వేల మంది దరఖాస్తుదారుల రేషన్ కార్డుల్లో ఇప్పటికీ వారి భర్తల పేర్లు నమోదై ఉన్నట్లు పరిశీలనలో తేలింది.
భర్తలు మరణించినప్పటికీ కొందరు కుటుంబాలు కోటా బియ్యం పొందేందుకు రేషన్ కార్డుల్లో వారి పేర్లను తొలగించకుండా కొనసాగిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
వివరాలు
ఐదు కేటగిరీలకు ఏడాదికి రూ.4,348 కోట్లు
వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, మత్స్యకారుల కేటగిరీలకు ప్రభుత్వం నెలకు రూ.4 వేల చొప్పున పింఛను అందిస్తోంది.
ఇప్పటివరకు పూర్తయిన పరిశీలన ఆధారంగా ఈ ఐదు కేటగిరీలకు నెలకు రూ.362.26 కోట్ల మేర ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఏడాదికి ఈ వ్యయం రూ.4,348.47 కోట్లకు చేరనుంది.
అయితే మొత్తం 13.65 లక్షల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటే.. నెలకు రూ.582.67 కోట్లు, ఏడాదికి రూ.6,991.99 కోట్ల మేర వ్యయం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
వివరాలు
16 జిల్లాల్లో 50 వేలకు పైగా దరఖాస్తులు
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం గిరిజన జిల్లాలను మినహాయిస్తే రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల నుంచి 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
16 జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య 50 వేలు దాటింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 67 వేల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 65,523, పల్నాడు జిల్లాలో 62,733 దరఖాస్తులు నమోదయ్యాయి. అత్యల్పంగా పోలవరం జిల్లా నుంచి 11,578 దరఖాస్తులు వచ్చాయి.