Telangana: తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో 15% కోత.. రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 'తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026'ను శనివారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందే ఉద్యోగులతో పాటు రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే, వారి వేతనం నుంచి నెలకు 15 శాతం నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. జిల్లా స్థాయిలో ప్రభుత్వం నియమించే ప్రత్యేక అధికారి (జిల్లా కలెక్టర్) ముందు ఉద్యోగి కారణాలు వివరిస్తూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
నైతిక బాధ్యత పెంపొందించడమే లక్ష్యం
సంబంధిత అధికారి దాన్ని పరిశీలించి, ఉద్యోగి వేతనం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు భృతిగా నిర్ణయిస్తారు. ఆధునిక సమాజంలో చిన్న కుటుంబాల పెరుగుదల, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణత, పట్టణాలకు వలసలు వంటి కారణాలతో వయోవృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల పట్ల బాధ్యత పెంచేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ బిల్లును కొత్తగా సచివాలయంలో చేరిన గ్రూప్-2 ఉద్యోగులతో రూపకల్పన చేయించినట్లు తెలిపారు.
వివరాలు
ఫిర్యాదు, విచారణకు స్పష్టమైన విధానం
తల్లిదండ్రుల్లో తల్లి లేదా తండ్రి, లేదా ఇద్దరూ జిల్లా స్థాయిలో నియమిత అధికారిని ఆశ్రయించి దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారి ఉద్యోగి, తల్లిదండ్రులకు వాదనలు వినిపించే అవకాశం ఇచ్చి విచారణ జరిపి, దరఖాస్తు అందిన 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. అనంతరం ఉద్యోగి జీతం నుంచి నిర్ణయించిన మొత్తాన్ని మినహాయించి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశిస్తారు. అపీలుకు అవకాశం అధికారి నిర్ణయంపై అసంతృప్తి ఉన్నా లేదా నిర్ణయం గడువులోగా రాకపోయినా, రాష్ట్రస్థాయిలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో పనిచేసే వయోవృద్ధుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. ఇందుకు 45 రోజుల గడువు ఉంటుంది. కమిషన్‌కు వచ్చిన అప్పీలను 60 రోజుల్లోగా పరిష్కరించాలని నిబంధనలో పేర్కొన్నారు.