Loading...
Bollaram: బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ వద్ద ప్లాస్టిక్‌ బకెట్‌లో 160 డిటోనేటర్లు లభ్యం
బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ వద్ద ప్లాస్టిక్‌ బకెట్‌లో 160డిటోనేటర్లు లభ్యం

Bollaram: బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ వద్ద ప్లాస్టిక్‌ బకెట్‌లో 160 డిటోనేటర్లు లభ్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే 160 ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు లభించడం కలకలం రేపింది. ఫైరింగ్‌ రేంజ్‌ వెనుక గోడకు సమీపంలో ఓ ప్లాస్టిక్‌ బకెట్‌లో 8 బండిల్స్‌గా ఉన్న డిటోనేటర్లను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.32 వేల వరకు ఉంటుందని సమాచారం. ఆర్మీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డిటోనేటర్లను అక్కడ ఎవరు వదిలి వెళ్లారు? వాటిని ఏ ఉద్దేశంతో అక్కడ ఉంచారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మల్కాజిగిరి బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌ సూచనల మేరకు అధికారులు డిటోనేటర్లను సురక్షితంగా భద్రపరిచారు.

వివరాలు 

ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు మధ్యలోనే..

హైదరాబాద్‌లో ఆర్మీ ఆధీనంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతున్న మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు జరుగుతున్న వేళ డిటోనేటర్లు బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

రెండ్రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలను భద్రపరిచే గది తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.

అక్కడి నుంచి మొత్తం 12 ఆయుధాలను ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

ఆర్మీ అధికారుల ఫిర్యాదు ఆధారంగా బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారం రక్షణ శాఖకు సంబంధించినది కావడంతో పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

వివరాలు 

కంటోన్మెంట్‌లో పలు శిక్షణ సంస్థలు..

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో రక్షణ దళాల శిక్షణ సంస్థకు చెందిన పలు రెజిమెంట్‌లు కొనసాగుతున్నాయి.

వాటిలో మద్రాస్‌ రెజిమెంట్‌ కూడా ఒకటి. ఈ రెజిమెంట్‌లో ఆర్మీ సిబ్బంది ఆయుధాలను భద్రపరిచే ప్రత్యేక విభాగం ఉంది.

భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ విభాగంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంటుంది.

ఆయుధాల భద్రతకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ ఆదివారం రాత్రి ఆ విభాగంలో చోరీ జరిగినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు.

ADVERTISEMENT

వివరాలు 

కంటోన్మెంట్‌లో పలు శిక్షణ సంస్థలు..

గది తాళాన్ని పగులగొట్టిన దుండగులు నాలుగు ఏకే-47లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్సాస్‌ రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రిని తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తుండగా.. తాజాగా అదే ప్రాంగణానికి సమీపంలో 160 ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆయుధాల చోరీకి, డిటోనేటర్ల లభ్యానికి ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాన్ని కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT