Tamil Nadu: తమిళనాడు జైలు నుంచి 17 మంది ఖైదీల పరార్.. గంటల్లోనే చిక్కిన ఐదుగురు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులోని తేని జిల్లాలో ఉన్న సబ్‌జైలు నుంచి 17 మంది ఖైదీలు తప్పించుకోవడం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరారైన వారిని పట్టుకునేందుకు తేని నుంచి దిండిగల్ వరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదుగురు ఖైదీలను పట్టుకుని మళ్లీ అరెస్టు చేశారు. మిగిలిన 12 మంది కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇందుకోసం సుమారు 16 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఖైదీలు జైలు వెనుకవైపు ఉన్న అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
మూర్ఛ వచ్చినట్లు నటించి.. సిబ్బందిపై దాడి
జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీలు ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది.
ఒకే గదిలో ఉన్న ఖైదీల్లో ఒకరు మూర్ఛ వచ్చినట్లు నటించాడు. అతడికి సాయం చేసేందుకు జైలు సిబ్బంది గదిలోకి వెళ్లగానే మిగతా ఖైదీలంతా వారిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఘటనలో గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు.
పరారైన ఖైదీలను పట్టుకునేందుకు 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మండల ఐజీ విజయేంద్ర బిడారీ తెలిపారు.
వివరాలు
తొమ్మిది మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ఖైదీలు తప్పించుకున్న ఘటనపై జైళ్ల శాఖ డీజీపీ సందీప్ రాయ్ తీవ్రంగా స్పందించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు భావిస్తూ తేని సబ్‌జైలులో పనిచేస్తున్న తొమ్మిది మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు.
ఈ జైలులో గరిష్ఠంగా 200 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉంది. అయితే, ప్రస్తుతం అక్కడ 300 మందికి పైగా ఖైదీలు ఉన్నట్లు సమాచారం.
ఘటన జరిగిన రాత్రి కేవలం ఆరుగురు నుంచి ఏడుగురు గార్డులు మాత్రమే విధుల్లో ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వివరాలు
1995 తర్వాత ఇదే అతిపెద్ద పరారీ ఘటన
తమిళనాడులో 1995లో 43 మంది ఎల్‌టీటీఈ సభ్యులుగా అనుమానించిన వ్యక్తులు నిర్బంధ కేంద్రం నుంచి తప్పించుకున్నారు.
ఆ ఘటన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఖైదీలు పరారవడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
అప్పట్లో వేలూరు కోటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిర్బంధ కేంద్రం నుంచి ఎల్‌టీటీఈ బృందం తప్పించుకుంది.
ఇందుకోసం 153 అడుగుల పొడవైన సొరంగాన్ని తవ్వి దాని ద్వారా బయటకు వెళ్లినట్లు చారిత్రక వివరాలు వెల్లడిస్తున్నాయి.