Loading...
Kaziah Liz Mejo: కేరళ అమ్మాయి సంచలనం.. 19 ఏళ్లకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం సొంతం

Kaziah Liz Mejo: కేరళ అమ్మాయి సంచలనం.. 19 ఏళ్లకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం సొంతం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

జైపూర్‌లోని జీ స్టూడియోలో ఆదివారం జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' గ్రాండ్ ఫినాలేలో కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ పోటీల్లో పాల్గొన్న 52 మంది అందాల భామలను వెనక్కినెట్టి ఆమె ప్రతిష్ఠాత్మక కిరీటాన్ని సొంతం చేసుకుంది. అందంతో పాటు తెలివితేటలతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్న కజియా.. ఈ టైటిల్ గెలిచిన తొలి కేరళ యువతిగా రికార్డు సృష్టించింది. గ్రాండ్ ఫినాలేలో మాజీ మిస్ యూనివర్స్ ఇండియా మనికా విశ్వకర్మ కజియాకు కిరీటం అందించారు. ఆహుతుల కరతాళధ్వనులు, కెమెరాల వెలుగుల మధ్య ఆమె కజియా తలపై కిరీటాన్ని అలంకరించారు.

వివరాలు 

మూడేళ్ల కల సాకారం

ఈ పోటీలకు దేశపు తొలి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశీ రౌతేలా, మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా, పర్యావరణవేత్త, సినిమా నిర్మాత ప్రగ్యా కపూర్, మాజీ మిస్ ఇండియా యూనివర్స్, మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం గెలుచుకోవడం తన మూడేళ్ల కలను సాకారం చేసిందని కజియా లిజ్ మెజో భావోద్వేగానికి గురైంది.

ఈ విజయం తనకు ఎంతో మధురమైన క్షణమని చెప్పింది. ఈ సందర్భంగా తన స్వరాష్ట్రం కేరళకు అందాల కిరీటాన్ని తీసుకెళ్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది.

వివరాలు 

భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో..

''ఈ క్షణం కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఈ కిరీటాన్ని నా స్వరాష్ట్రం కేరళకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది'' అని కజియా పేర్కొంది.

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా నిలిచిన కజియా లిజ్ మెజోకు అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది.

అమెరికా ఆధీనంలోని ప్యూర్టో రికోలో నవంబర్‌లో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఆమె భారత్ తరఫున బరిలోకి దిగనుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఐదేళ్ల నుంచే మోడలింగ్‌లో..

కజియా లిజ్ మెజో 2007లో జన్మించింది. అబూధాబీలో పెరిగిన ఆమె అక్కడి ఎమిరేట్స్ నేషనల్ స్కూల్, అబుధాబీ ఇండియన్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసింది.

ప్రస్తుతం న్యాయ విద్యను అభ్యసిస్తూనే మోడలింగ్ రంగంలో కొనసాగుతోంది.

కజియాకు చిన్న వయసు నుంచే కళలపై ఆసక్తి ఉంది. ఐదేళ్ల వయసు నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది.

అంతేకాకుండా పాటలు పాడటంతో పాటు డ్రమ్ములు, వయోలిన్ వాయించడంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

సినిమాలోనూ నటన..

మోడలింగ్‌తో పాటు కజియా లిజ్ మెజోకు సినిమాల్లోనూ అనుభవం ఉంది.

మలయాళ చిత్రం 'షైలాక్'లో ఆమె నటించింది. ఇక 2025లో జరిగిన 'మిస్ టీన్ ఇంటర్నేషనల్' పోటీల్లో కజియా తొలి రన్నరప్‌గా నిలిచింది.

ఆ అనుభవంతో మరింత పట్టుదలగా ముందుకు సాగిన ఆమె.. ఇప్పుడు మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకుని తన మూడేళ్ల కలను సాకారం చేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

19 ఏళ్లకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం సొంతం

ADVERTISEMENT