J&K: జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు పోలీసుల దారుణ హత్య.. అడవిలో మృతదేహాలు.. ఆయుధాలు మాయం!
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు స్పెషల్ పోలీసు ఆఫీసర్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. కిశ్త్‌వాడ్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ బుధవారం అదృశ్యమైన ఇద్దరు పోలీసులు.. గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో విగతజీవులుగా కనిపించారు. వారి శరీరాలపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో వారి సర్వీసు తుపాకులు కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిశ్త్‌వాడ్ జిల్లాలోని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌కు చెందిన బాబీ చాంద్ (57),రశ్‌పాల్ కుమార్ (45) బుధవారం మధ్యాహ్నం తమ క్యాంపు నుంచి ధర్నా-మర్వా ప్రాంతంలోని ఆర్మీ పోస్టుకు బయల్దేరారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో దచన్ అటవీ ప్రాంతం నుంచి కొన్ని శబ్దాలు వినిపించాయి.
వివరాలు
శరీరాలపై బుల్లెట్ గాయాలు
దీంతో ఆ దిశగా వెళ్లిన ఇద్దరు అధికారులు తిరిగి రాలేదు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ సేవలు కూడా నిలిచిపోవడం గమనార్హం.
వారు కనిపించకుండా పోయినట్లు గుర్తించిన ఆర్మీ బలగాలు అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ క్రమంలో గురువారం ఉదయం భద్రతా సిబ్బంది ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. వారి శరీరాలపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అంతేకాకుండా ఘటనాస్థలంలో వారి సర్వీసు తుపాకులు కూడా కనిపించలేదు. దీంతో ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
వివరాలు
సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రదాడి
ఉగ్రవాదులు ఇద్దరు పోలీసు అధికారులను కిడ్నాప్ చేసి, అనంతరం హత్య చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి.
హత్యకు గల కారణాలు, ఘటన వెనుక ఉన్నవారి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో మోటార్ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
వివరాలు
సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రదాడి
ఇదే సమయంలో కిశ్త్‌వాడ్ జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులు అదృశ్యమై, మరుసటి రోజు మృతదేహాలుగా కనిపించడం భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
కుల్గామ్‌లో సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి, కిశ్త్‌వాడ్‌లో పోలీసుల హత్య ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.