LOADING...
3 killed: కోల్‌కతాలో ఘోర ప్రమాదం.. గోదాం కూలి ముగ్గురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
కోల్‌కతాలో ఘోర ప్రమాదం.. గోదాం కూలి ముగ్గురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

3 killed: కోల్‌కతాలో ఘోర ప్రమాదం.. గోదాం కూలి ముగ్గురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 24, 2026
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని తారాతలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ గోదాం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో బ్రేస్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆక్టేవియస్ టీ అండ్ ఇండస్ట్రీస్‌కు చెందిన గోదాంలో జరిగింది. భవనం కూలిన సమయంలో అందులో 25 నుంచి 30 మంది వరకు ఉన్నారని స్థానికులు అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

వివరాలు

శిథిలాల కింద 30 మంది..

ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపిన వివరాల ప్రకారం, శిథిలాల కింద చిక్కుకున్న వారు సహాయం కోసం అరుస్తూ వినిపించారని చెప్పారు. "గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా, మొదటి, రెండో అంతస్తుల ఆర్‌సీసీ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. అయితే ఒక్కసారిగా మొత్తం నిర్మాణం కుప్పకూలిపోయింది" అని ఓ ప్రత్యక్ష సాక్షి పీటీఐకి తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన అగ్నిమాపక శాఖ అధికారి, నిర్మాణంలో నాసిరకం సామగ్రిని ఉపయోగించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పైకప్పు కాస్టింగ్ పనులు జరుగుతున్న సమయంలోనే భవనం కూలిపోయిందని తెలిపారు.

వివరాలు

ముమ్మరంగా సహాయక చర్యలు..

శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు ఇనుప రాడ్లు, కాంక్రీట్‌ను గ్యాస్ కట్టర్ల సహాయంతో కత్తిరిస్తున్నాయి. అలాగే నిలువు దిశలో డ్రిల్లింగ్ చేస్తూ బాధితులను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సహాయక చర్యల్లో భారత సైన్యం కూడా పాల్గొంది. ఇప్పటివరకు 10 మందిని సురక్షితంగా బయటకు తీసి సమీప ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. స్థానికులు, కార్మికుల సమాచారం ప్రకారం, ఇనుము, సిమెంట్‌తో నిర్మిస్తున్న ఈ మూడు అంతస్తుల భవనం దాదాపు ఏడాది కాలంగా నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం మరమ్మతుల పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు మొత్తం నిర్మాణం ఒక్కసారిగా కూలిపోయినట్లు సమాచారం.

Advertisement