Hormuz Strait Reopens: హర్మూజ్ మార్గం క్లియర్.. జలసంధిని దాటిన 30 భారత నౌకలు,మరో 26 ప్రయాణానికి సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు ఫలితాన్నివ్వడంతో ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దీంతో భారత్‌కు పెద్ద ఊరట లభించింది. భారతదేశానికి వస్తున్న 30 నౌకలు ఇప్పటికే హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటగా, మరో 26 నౌకలు ప్రయాణ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్‌కు అవసరమైన ముడిచమురు, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ), వ్యవసాయ రంగానికి కీలకమైన ఎరువులు ప్రధానంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచే దిగుమతి అవుతున్నాయి.
వివరాలు
పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయిన నౌకలు
ఈ సరఫరాలన్నీ ఎక్కువగా హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతాయి. తాజా పరిణామాలతో దేశ ఇంధన భద్రతపై నెలకొన్న ఆందోళనలు గణనీయంగా తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిపై నియంత్రణను కట్టుదిట్టం చేయడంతో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వందలాది నౌకలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే నిలిచిపోయాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం తర్వాత సముద్ర రవాణాను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతం అనుమతుల కోసం వేచి ఉన్న 26 భారతీయ నౌకల్లో మూడు నౌకలు ఇంధన సరుకుతో, 10 నౌకలు ఎరువులతో, మిగిలిన 13 నౌకలు ఇతర నిత్యావసర వస్తువులతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం.
వివరాలు
ఇంధన ధరలపై ప్రభావం ఎలా ఉండొచ్చు?
ఇదిలా ఉండగా, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌వోసీ)కు చెందిన రెండు భారీ ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు ఇప్పటికే సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటి తమిళనాడులోని ఎన్నూర్, కేరళలోని కొచ్చి టెర్మినల్స్‌కు ద్రవీకృత సహజ వాయువును (ఎల్‌ఎన్‌జీ) విజయవంతంగా చేరవేశాయి. హర్మూజ్ జలసంధిలో రవాణా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటే దేశంలో ఇంధన ధరలు స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎరువుల సరఫరా మెరుగుపడి వ్యవసాయ రంగానికి కూడా ఊరట లభించే అవకాశముంది.
వివరాలు
ఆపరేషన్ ఊర్జా సురక్ష
అయితే యుద్ధం ముగిసినప్పటికీ సముద్ర బీమా ప్రీమియం పెరగడం,సముద్రంలో ఏర్పాటు చేసిన మైన్ల తొలగింపు వంటి సవాళ్ల కారణంగా రవాణా పూర్తిగా పూర్వస్థితికి చేరుకోవడానికి మరికొన్ని వారాలు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం నౌకాదళం ఆధ్వర్యంలో 'ఆపరేషన్ ఊర్జా సురక్ష'ను కొనసాగిస్తూ, భారతీయ నౌకలకు భద్రత కల్పించడంతో పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.