Nepal: నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 37 మంది తమిళ యాత్రికుల ఆచూకీ గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల్లో 37 మంది తమిళ యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం. తంజావూర్ జిల్లా కుంభకోణం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే 'సూపర్ యాత్తిరై ఏజెన్సీ' ద్వారా తమిళనాడుకు చెందిన 57 మంది మూడు వ్యాన్లలో ఈ నెల 23న నేపాల్ పర్యటనకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఆకస్మికంగా వరదలు ముంచెత్తడంతో ఆ మూడు వాహనాలు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ బృందంలో తిరుచ్చి, చెన్నై, చిదంబరం, మయిలాడుతురై, తిరువారూర్, తంజావూర్, తిరువణ్ణామలై, కృష్ణగిరి, ధర్మపురి తదితర జిల్లాలకు చెందిన యాత్రికులు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి చెందిన కొందరు కూడా ఈ బృందంలో ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీ వెల్లడించింది.
వివరాలు
20 మంది సురక్షితం.. 15 మందికి చికిత్స
వరదల్లో చిక్కుకున్న వారిలో 20 మంది ఎట్టకేలకు ముంపు ప్రాంతం నుంచి బయటపడి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నట్లు తెలిసింది.
వారిలో 15 మందిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మిగిలిన 37 మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
వరదల కారణంగా పలు ప్రాంతాల్లో సమాచార సంబంధాలు కూడా దెబ్బతినడంతో గల్లంతైన వారి పరిస్థితిపై వెంటనే సమాచారం అందడం కష్టంగా మారింది.
వివరాలు
సహాయ నంబర్లు విడుదల
గల్లంతైన తమిళ యాత్రికుల వివరాలను తెలుసుకోవడంతోపాటు, బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రవాస తమిళుల పునరావాసం, సంక్షేమ కమిషనరేట్ ప్రత్యేక సహాయ నంబర్లను ప్రకటించింది.
టోల్‌ఫ్రీ నంబరు: 1800 309 3793
విదేశాల నుంచి సంప్రదించేందుకు: +91 80690 09901
మిస్డ్ కాల్ కోసం: +91 80690 09900
దిల్లీలోని తమిళనాడు హౌస్ కంట్రోల్ రూమ్: 92895 16712
వివరాలు
మాజీ న్యాయమూర్తి కూడా వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం
మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శివజ్ఞానం కూడా నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు ఆయన బంధువులు తెలిపారు.
ఆయన ఇటీవల నేపాల్ పర్యటనకు వెళ్లినట్లు చెప్పారు.
వరదల అనంతరం ఆయనను ఫోన్‌లో సంప్రదించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ సంబంధాలు ఏర్పడలేదని వెల్లడించారు.
నేపాల్‌లో వరదల కారణంగా సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో జస్టిస్ శివజ్ఞానం ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఆయన పరిస్థితి ఎలా ఉందన్నది తెలియడం లేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
గల్లంతైన తమిళ యాత్రికుల ఆచూకీ కోసం అధికారులు, సంబంధిత వర్గాలు చర్యలు కొనసాగిస్తున్నాయి.