Loading...
Bihar: టూరిస్టు స్పాట్‌లో యువతిపై దాడి.. బిహార్‌లో మరో వేధింపుల ఘటన
టూరిస్టు స్పాట్‌లో యువతిపై దాడి.. బిహార్‌లో మరో వేధింపుల ఘటన

Bihar: టూరిస్టు స్పాట్‌లో యువతిపై దాడి.. బిహార్‌లో మరో వేధింపుల ఘటన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2026
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో అమ్మాయిలపై వేధింపుల ఘటనలు వరుసగా వెలుగుచూస్తుండటం కలకలం రేపుతోంది. జాముయి,సమస్తీపుర్ జిల్లాల్లో మైనర్ బాలికలపై ఆకతాయిలు దురుసుగా ప్రవర్తించిన ఘటనలు మరువకముందే.. తాజాగా బంకా జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మందర్ హిల్ వద్ద ఓ యువతిపై ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. మందర్ హిల్ వద్ద యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆరుగురు వ్యక్తులు.. ఆమెపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 3న ఈ ఘటన జరిగినప్పటికీ.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.

వివరాలు 

జాముయిలోనూ ఇదే తరహా ఘటన

ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇటీవల జాముయి జిల్లాలో ఇద్దరు స్నేహితులైన టీనేజర్లు కోచింగ్ సెంటర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు వారిని రోడ్డుపైనే అడ్డుకున్నారు.

అనంతరం బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆమెను గట్టిగా పట్టుకుని లాక్కెళ్లడంతో పాటు అభ్యంతరకరంగా తాకినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

వివరాలు 

సమస్తీపుర్‌లోనూ వేధింపులు

జాముయి ఘటన మరువకముందే సమస్తీపుర్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది.

ఓ టీనేజీ బాలిక, బాలుడు కలిసి రోడ్డుపై నడుచుకుంటూ ఫొటోలు తీసుకుంటుండగా కొందరు ఆకతాయిలు వారిని అడ్డుకున్నారు.

అనంతరం బాలికతో అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన కూడా తీవ్ర చర్చకు దారితీసింది.

వరుస ఘటనలతో రాజకీయ దుమారం

బిహార్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు రాజకీయంగానూ దుమారం రేపుతున్నాయి.

రాష్ట్రంలో అమ్మాయిలకు భద్రత లేకుండా పోతోందని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

తాజాగా మందర్ హిల్ ఘటన వెలుగులోకి రావడంతో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

ADVERTISEMENT