Andhra Pradesh: నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో బ్యాటరీ పరిశ్రమ.. 5,700 మందికి ఉపాధి
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడితో బ్యాటరీ ముడిపదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. భారత్‌కు చెందిన కార్బన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దక్షిణ కొరియాకు చెందిన కాస్మో ఏఎంఅండ్టీ సంస్థలు సంయుక్తంగా ఈ పరిశ్రమను నెలకొల్పనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 700 మందికి, పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా బుధవారం విశాఖపట్నంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో రెండు సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులు, ఉత్పత్తి సామర్థ్యం, భవిష్యత్తులో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలపై మంత్రితో చర్చించారు.
వివరాలు
బ్యాటరీల తయారీతో పాటు పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి కూడా ప్రాధాన్యం: లోకేశ్
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. బ్యాటరీల తయారీతో పాటు పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
బ్యాటరీ క్యాథోడ్ పదార్థాల నాణ్యతను పరీక్షించడం, వినియోగించిన బ్యాటరీల నుంచి విలువైన ముడిపదార్థాలను తిరిగి సేకరించే రీసైక్లింగ్ సాంకేతికత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు.
ఈ అంశాల్లో పరిశోధనల కోసం ఐఐటీ తిరుపతితో కలిసి పనిచేయాలని సూచించారు.
ఐఐటీ తిరుపతిలో ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), బ్యాటరీల తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
వివరాలు
మూడు దశల్లో పరిశ్రమ అభివృద్ధి
ఈ సమావేశంలో కార్బన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అభినవ్‌కుమార్ జలాన్, కాస్మో ఏఎంఅండ్టీ ఉపాధ్యక్షుడు డ్యూక్ క్యూ పార్క్, జనరల్ మేనేజర్ బ్యోంగ్డే కిమ్ పాల్గొన్నారు.
నాయుడుపేటలో 230 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ పరిశ్రమను అభివృద్ధి చేయనున్నారు.
కాస్మో సంస్థకు చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ బ్యాటరీ తయారీకి అవసరమైన కీలక ముడిపదార్థాలను ఉత్పత్తి చేస్తారు.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర అవసరాలకు ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కీలకమైన ఫెరిక్ ఫాస్ఫేట్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) క్యాథోడ్ పదార్థాలను తయారు చేయనున్నారు.