Assam: అస్సాంలో ఆయిల్ ఇండియా ట్యాంక్ ఫామ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL)కు చెందిన ట్యాంక్ ఫామ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. దిబ్రూగఢ్ జిల్లా టెంగాఖత్‌లోని ఆయిల్ ఇండియా ఇంటర్మీడియట్ ట్యాంక్ ఫామ్ (ITF)లో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నిర్వహణ పనులు జరుగుతుండగా ఉదయం 9.05 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఆరుగురికి కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (AMCH), ఆయిల్ ఇండియా ఆసుపత్రికి తరలించారు.
వివరాలు
వాల్వ్‌ను ఆపరేట్ చేస్తున్న సమయంలో ప్రమాదం
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ట్యాంక్ ఫామ్‌లో కార్మికులు ఓ వాల్వ్‌ను ఆపరేట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ముడి చమురు నిల్వ చేసే విభాగంలో పేలుడు సంభవించడంతో మంటలు భారీగా వ్యాపించినట్లు సమాచారం.
గాయపడిన వారిలో ఐదుగురిని గుర్తించారు. దిబ్రూగఢ్‌లోని మిలన్ నగర్‌కు చెందిన తపస్ గోగోయ్ (40), టెంగాఖత్‌కు చెందిన శైలేన్ గోగోయ్ (45), కుముద్ గోగోయ్ (38), గోలప్ దత్తా (58), ఇంద్ర గోగోయ్ (40) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
ప్రమాదంలో గాయపడిన కార్మికులు ఆయిల్ ఇండియా లిమిటెడ్ నియమించిన ముంబైకి చెందిన స్పెక్ట్రాన్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో మరికొందరు కూడా గాయపడి ఉండవచ్చని భావిస్తున్నారు.
అయితే పేలుడుకు గల కచ్చితమైన కారణాలు, ప్రమాదం జరిగిన పరిస్థితులపై అధికారికంగా స్పష్టత రాలేదు.
సమాచారం అందుకున్న వెంటనే ఆయిల్ ఇండియా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.