Delhi: ఢిల్లీ సత్యానికేతన్‌లో కూలిన పీజీ హాస్టల్.. ఐదుగురు అధికారులపై వేటు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ దిల్లీలోని సత్యానికేతన్‌లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి దక్షిణ జోన్ డిప్యూటీ కమిషనర్ రాకేశ్ కుమార్‌తో పాటు నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ మున్సిపల్ శాఖకు చెందిన విజిలెన్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. హాస్టల్ భవనం కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనపై బాధ్యతను పరిశీలించిన అధికారులు, సంబంధిత విభాగానికి చెందిన ఐదుగురిపై చర్యలు తీసుకున్నారు.
వివరాలు
కూలిపోయిన పీజీ హాస్టల్ భవనం యజమానులను గుర్తించిన అధికారులు
సస్పెన్షన్‌కు గురైన వారిలో సూపరెంటెండింగ్ ఇంజినీర్ రన్‌వీర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (బిల్డింగ్) లలిత్ కుమార్ గోయల్, అసిస్టెంట్ ఇంజినీర్ (బిల్డింగ్) సునీల్ చౌహాన్, జూనియర్ ఇంజినీర్ (బిల్డింగ్) ఆశిష్ కుమార్ ఉన్నారు. వీరితో పాటు దక్షిణ జోన్ డిప్యూటీ కమిషనర్ రాకేశ్ కుమార్‌పైనా చర్యలు తీసుకున్నారు.
ఢిల్లీ మున్సిపాలిటీ విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారి నంద కిషోర్ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, కూలిపోయిన పీజీ హాస్టల్ భవనం యజమానులను అధికారులు గుర్తించారు.
గురుగ్రామ్‌కు చెందిన హరి రామ్ భన్సల్, ఆనంద్ భన్సల్, ఆజాద్ భన్సల్‌లు భవనం యజమానులుగా గుర్తించినట్లు తెలిపారు.