
Karnataka: కర్ణాటకలో ఐదు పులుల మృతి కలకలం - విషప్రయోగమే కారణమా?
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ పరిధిలో వన్యప్రాణులపై కర్కశంగా ప్రవర్తించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అటవీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,ఓ పెద్ద పులితో పాటు దాని నాలుగు పిల్లలు చనిపోయినట్లు నిర్ధారించారు. విచారణలో ఈ మరణాలకు కారణం విషప్రయోగమని తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకేరోజులో ఐదు పులులు చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొంటూ,దీనిపై గంభీర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అటవీ శాఖ అంటోంది. మరణించిన పెద్ద పులి కొద్ది రోజుల క్రితం సమీపంలోని ఓ గ్రామంలోకి వచ్చి ఆవును చంపిన ఘటన జరిగింది. దానికి ప్రతీకారంగా గ్రామస్తులు ఆ ఆవు కళేబరంలో విషం కలిపి పులికి ఎర వేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
శవ పరీక్షలోనూ విషప్రయోగమే కారణమని స్పష్టం
ఆ కళేబరం తిన్న పులులు చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నారు.. శవ పరీక్షలోనూ విషప్రయోగమే కారణమని స్పష్టమైందని సమాచారం. ఈ విషయంలో తీవ్రంగా స్పందించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఈ పులుల మరణాలు అసహజంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడి, మూడు రోజులలోపుగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ వైఫల్యమే పులుల మృతికి కారణమని తేలితే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికీ వెనుకాడమని ఆయన స్పష్టం చేశారు. ఇక స్థానిక గ్రామస్తుల విషయానికొస్తే, తమ పశువులపై పులులు దాడులు చేస్తున్నాయన్న ఆగ్రహంతో వారు పగ తీర్చుకునేందుకు విషప్రయోగానికి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
వివరాలు
కర్ణాటకలో 563 పులులు
మలేమహదేశ్వర హిల్స్ ప్రాంతంలో ఇటువంటి దుర్మార్గమైన చర్యలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత దేశంలో రెండో స్థానంలో పులుల సంఖ్య కర్ణాటకలోనే ఉంది. ప్రభుత్వ స్థాయిలో పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ పశుసంపదను కాపాడుకోవడానికి మృగాలపై విషప్రయోగానికి వెళ్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ఏ వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు? వారి ఉద్దేశ్యాలు ఏమిటి? అన్నదానిపై ఆరా తీస్తున్నారు. పులుల సంరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వన్యప్రాణుల సంరక్షకులు భావిస్తున్నారు.