Page Loader
TGSRTC: దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC షాక్.. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా వసూలు
దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC షాక్

TGSRTC: దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC షాక్.. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా వసూలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2024
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అతిపెద్ద పండగ దసరా. నగరాలు, పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఈ పండక్కి సొంతూళ్ల బాట పడతారు. దీన్ని ఆసరా చేసుకొని ప్రజారవాణా సంస్థ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతోంది. గత ఏడాది, అంతకు ముందు సంవత్సరాల్లో దసరా పండక్కి సొంతూళ్లకు సాధారణ ఛార్జీలతోనే వెళ్లి వచ్చిన ప్రజల నుంచి ఆర్టీసీ ఈసారి అదనపు ఛార్జీలు వసూలుచేస్తోంది. మహాలక్ష్మి పథకం తర్వాత సంస్థ లాభాల బాటలోకి వచ్చింది. ఇలాంటి సానుకూల తరుణంలో మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని భావించిన ప్రయాణికులకు టీజీఎస్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులు షాకిచ్చారు.

వివరాలు 

 టికెట్‌ బేసిక్‌ ధరలో 50 శాతం పెంపు 

దసరాకు నడుపుతున్న ప్రత్యేక సర్వీసుల టికెట్‌ బేసిక్‌ ధరలో 50 శాతం పెంచారు. దీంతో ఛార్జీలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌-ఆదిలాబాద్‌ సూపర్‌లగ్జరీ రెగ్యులర్‌ బస్‌లో ఛార్జీ రూ.630 ఉండగా ప్రత్యేక బస్సుల్లో రూ.880 అవుతోంది. హైదరాబాద్‌ నగరంలో నడిపే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులనూ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో దూరప్రాంతాలకు నడుపుతోంది. నిజానికి ఈ బస్సులు నగరంలో పరిమిత దూరం ప్రయాణానికే సౌకర్యంగా ఉంటాయి. కానీ వందల కిమీ దూరప్రాంతాలకూ 50 శాతం అదనపు బాదుడుతో ఆర్టీసీ నడిపిస్తోంది.

వివరాలు 

సూపర్‌లగ్జరీ ఛార్జీల్ని మించిన డీలక్స్‌

హైదరాబాద్‌ నుంచి వివిధ రూట్లలో ఎక్స్‌ప్రెస్,సూపర్‌లగ్జరీ బస్నుల్నిరెగ్యులర్‌తో పాటు ప్రత్యేక బస్సులనూ ఆర్టీసీ నడిపిస్తోంది. డీలక్స్‌ బస్సుల విషయానికి వస్తే, పలు రూట్లలో ప్రతి బస్సునూ అధిక ఛార్జీలతో ప్రత్యేక బస్సుగానే నడిపిస్తోంది. సాధారణ ఛార్జీలతో రెగ్యులర్‌ బస్సుల్లేకుండా చేసింది. సాధారణంగా డీలక్స్‌ కంటే సూపర్‌లగ్జరీ ఛార్జీ ఎక్కువ. ప్రతి డీలక్స్‌ బస్సునూ ప్రత్యేకం చేయడంతో సూపర్‌లగ్జరీ ఛార్జీల్ని డీలక్స్‌ మించిపోయాయి. హైదరాబాద్‌-ఖమ్మం మధ్య 10వ తేదీన 13 డీలక్స్‌ బస్సులుంటే అన్నీ అదనపు ఛార్జీలతో నడిచే ప్రత్యేక బస్సులే. ఈ మార్గంలో సూపర్‌లగ్జరీ టికెట్‌ (రెగ్యులర్‌)రూ.430 అయితే,డీలక్స్‌ ప్రత్యేక బస్సులో ఛార్జీ రూ.440. 10వ తేదీన హైదరాబాద్‌ నుంచి 1,041, 11న 1,341 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది.