LOADING...
History of Emergency: ఎమర్జెన్సీకి 50 ఏళ్లు.. భారత చరిత్రలోని చీకటి అధ్యాయం ఇదే!
ఎమర్జెన్సీకి 50 ఏళ్లు.. భారత చరిత్రలోని చీకటి అధ్యాయం ఇదే!

History of Emergency: ఎమర్జెన్సీకి 50 ఏళ్లు.. భారత చరిత్రలోని చీకటి అధ్యాయం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 25, 2025
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యవసర పరిస్థితిని చీకటి రోజుగా అభివర్ణిస్తారు. ఆ కాలంలో భావ ప్రకటనా స్వేచ్ఛని రద్దు చేసి, ప్రతిపక్షాలు, ఉద్యమకారులను స్టెరిలైజేషన్ నుంచి జైలు శిక్ష వరకు అనేక ఇబ్బందులను ఎదుర్కోనిచేశారు. అప్పుడు జరిగిన పరిస్థితులను, ఇబ్బందులను కూర్చి 'ది ఎమర్జెన్సీ డైరీస్' పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రధాని మోడీ తాజాగా ప్రకటించారు. ఎమర్జెన్సీని రాజ్యాంగ హత్యా దినోత్సవం ('సంవిధాన్ హత్య దివస్‌')గా బీజేపీ జూన్ 25న జరుపుకుంటోంది. త్యాగరాజ స్టేడియంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు.

Details

ఎమర్జెన్సీ ఎప్పుడు? ఎందుకు విధించారు? 

దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. ప్రజాస్వామ్యంపై జరిగిన హేయ దాడిగా ఇది మిగిలింది. ఉక్కుమహిళగా పేరొందిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితంలో ఇది ఒక సరిదిద్దుకోలేని తప్పిదం. కాంగ్రెస్ పార్టీని నేటికీ వెంటాడే చేదుజ్ఞాపకం. ఆమె అధికారాన్ని నిలుపుకునే క్రమంలో తీసుకున్న నిర్ణయాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జూన్ 25, 1975 నుంచి మార్చి 21, 1977 వరకు దాదాపు 21 నెలల పాటు నియంతృత్వ పాలనలో ప్రజలు అల్లాడిపోయారు. లక్షలాది మంది జైలుకెళ్లారు, చిత్రవధ అనుభవించారు.

Details

ఇందిరా గాంధీపై 7 అభియోగాలు 

1971 ఎన్నికల్లో కాంగ్రెస్ 352 సీట్లు గెలిచింది. బ్యాంకుల జాతీయీకరణ, పేదల పట్ల అనుకూలతతో ప్రజల మన్ననలు పొందిన ఇందిరా గాంధీ మరింత శక్తిమంతురాలిగా అవతరించారు. బంగ్లాదేశ్ యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించడం ద్వారా ఆమె 'మూగ బొమ్మ' అనే ఇమేజ్‌ తొలగిపోయింది. కానీ నాలుగేళ్లకే దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. కరువు, కాటకాలు, నిరుద్యోగం, పారిశ్రామిక అభివృద్ధి లోటుతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ క్రమంలో రాయ్‌బరేలీ నుంచి 1971 ఎన్నికల్లో గెలిచిన ఇందిరపై యునైటెడ్ సోషలిస్టు పార్టీ అభ్యర్థి రాజ్‌నారాయణ్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Details

ఆయన చేసిన 7 అభియోగాలు ఇవే

ప్రభుత్వ అధికారి యశ్‌పాల్ కపూర్‌ని ఎన్నికల ప్రతినిధిగా నియమించడం. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను ప్రచారానికి వినియోగించడం. ఓటర్లకు లంచం ఇవ్వడం, బోగస్ ఓటింగ్‌ జరిపించడం. ఈ క్రమంలో 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్ట్ జడ్జి జగ్‌మోహన్ లాల్ సిన్హా తీర్పునిచ్చారు. ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇందిరా గాంధీని అర్హత కోల్పోయినట్లుగా ప్రకటించారు. మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పునిచ్చారు.

Advertisement

Details

సుప్రీంకోర్టు జోక్యం

తీర్పుతో రాజీనామా చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్న ఇందిరా గాంధీ జూన్ 22న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూన్ 24న కోర్టు తీర్పు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ, ప్రధానిగా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనవచ్చని, ప్రసంగాలివ్వవచ్చని అనుమతించింది. కానీ ఎంపీగా విధులను నిర్వర్తించడం, ఓటింగ్‌లలో పాల్గొనడాన్ని నిషేధించింది. తుది తీర్పు వచ్చేంత వరకు ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపింది.

Details

 రాష్ట్రపతికి ఇందిరా గాంధీ లేఖ

తన విశ్వాసపాత్రుల సూచనలపై రాజీనామా చేసి స్వరణ్‌సింగ్‌ను తాత్కాలిక ప్రధానిగా చేయాలనుకున్న ఇందిరా గాంధీ నిర్ణయాన్ని జగ్జీవన్ రామ్ వ్యతిరేకించారు. తాను కూడా ప్రధాని రేసులో ఉన్నానని అన్నారు. ఈ సమయంలో రాంలీలా మైదానంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. ప్రజల్లో ఇందిరా గాంధీ వ్యతిరేకత తీవ్రతరమయింది. జూన్ 25న ఆమె రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్‌కు లేఖ రాసారు. అంతర్గత భద్రతకు ముప్పు ఉన్నందున ఎమర్జెన్సీ విధించడం సముచితమని పేర్కొన్నారు.

Details

జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ 

ఆర్టికల్ 352 (1) ప్రకారం రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జూన్ 25 అర్ధరాత్రి 11:45 గంటలకు ఎమర్జెన్సీని ప్రకటించారు. వెంటనే జయప్రకాశ్ నారాయణ్, అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, మొరార్జీ దేశాయ్‌తో సహా ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 11 లక్షల మందిని జైలుకెళ్లించగా, అందులో సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, యువజన, రైతు సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. 1976 ఏప్రిల్‌లో ఢిల్లీలోని పలు మురికివాడలను బలవంతంగా ఖాళీ చేయించడం వల్ల వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Details

ఆర్ఎస్ఎస్ పాత్ర

ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. జిల్లా స్థాయి పత్రికలు, మాస పత్రికలు, 'సత్య సమాచార్' వంటి పత్రికల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. జూలై 4, 1975న ఎమర్జెన్సీ సమయంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్ఎస్ఎస్‌ పై నిషేధం విధించారు. జూన్ 30న అప్పటి ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌ బాలాసాహెబ్‌ దేవరస్‌ ను అరెస్టు చేసి జైలుకు పంపారు.

Details

కాంగ్రెస్ ఘోర పరాజయం 

1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలం పూర్తయింది. కానీ లోక్‌సభ గడువును మరో ఏడాది పొడిగిస్తూ 1976 ఫిబ్రవరి 4న సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమర్జెన్సీని మరొక సంవత్సరం కొనసాగించారు. 1977జనవరి 18న రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని ప్రకటించారు. జనవరి 24న జనతా పార్టీని ఏర్పాటు చేసి, మొరార్జీ దేశాయ్ నేతృత్వం వహించారు. మార్చి 16-20 మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. జనతా పార్టీ 345 సీట్లను కైవసం చేసుకుని అధికారం చేపట్టింది. 1977 మార్చి 21న కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 23 వరకు ఎమర్జెన్సీ అమలులో ఉండగా, మార్చి 24న మొరార్జీ దేశాయ్ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement