COVID-19: తిరుపతిలో తొలి కరోనా కేసు.. ఏపీలో మళ్లీ పెరుగుతున్న ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
కరోనా మహమ్మారి పేరు వినగానే ఇప్పటికీ చాలా మందికి ఆ భయానక రోజులు గుర్తుకొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్ ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని వారు ఎంతో మంది ఉన్నారు. ఇటీవలి రోజుల్లో ఆంధ్రప్రదేశ్'లోని పలు జిల్లాల్లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా తిరుపతిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం మరింత అప్రమత్తతకు దారితీసింది. తిరుపతి అర్బన్ పరిధికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుండటంతో వైద్యులు జూలై 23నకరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా 49 కరోనా కేసులు
పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వెంటనే వైద్య బృందం కుటుంబ సభ్యులకూ పరీక్షలు చేపట్టింది.
అయితే, వారికి వైరస్ సోకలేదని, అందరి ఫలితాలు నెగిటివ్‌గా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు అధికారికంగా 49 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇందులో శనివారం ఒక్క రోజే 10 కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం.
కడపతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ కరోనా కేసులు బయటపడుతున్నాయి.
కరోనా నిర్ధారణ అయిన వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
వివరాలు
కరోనా కారణంగా నలుగురు మృతి
తాజాగా కృష్ణా,తిరుపతి,విశాఖపట్నం,అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదు కాగా,రాష్ట్రంలో ఇప్పటివరకు ఈసారి కరోనా కారణంగా నలుగురు మృతి చెందినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా,పుణెలోని ప్రత్యేక ప్రయోగశాలలో వైరస్ నమూనాలను పరీక్షించగా ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలను పోలి ఉందని వైద్య నిపుణులు వెల్లడించారు.
దీంతో ప్రజలు అధికంగా భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
జ్వరం,దగ్గు,గొంతునొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తే ముందుగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి ఆస్పత్రిలో చికిత్స పొందాలని సూచించారు.
అలాగే ప్రజలు రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.