LOADING...
H-CITI Project: కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు.. ట్రాఫిక్‌కు చెక్!
కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు.. ట్రాఫిక్‌కు చెక్!

H-CITI Project: కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు.. ట్రాఫిక్‌కు చెక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. KBR నేషనల్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అధికారులు. హెచ్-సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ భారీ నిర్మాణ కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటికే కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టు-1లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మార్గంలో ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మించనున్నారు. ఈ నిర్మాణంతో కేబీఆర్ పార్క్ జంక్షన్ సిగ్నల్-ఫ్రీ జంక్షన్‌గా మారనుంది. అలాగే సాగర్ సొసైటీ వద్ద అండర్‌పాస్ నిర్మాణం పూర్తయితే ఆ జంక్షన్ కూడా సిగ్నల్-ఫ్రీ అవుతుంది.

Details

మొత్తం ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లు

ప్రాజెక్టు-2లో భాగంగా క్యాన్సర్ హాస్పిటల్ నుంచి అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, రోడ్ నెంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణం చేపట్టనున్నారు. రానున్న రెండేళ్లలో అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.1000 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. రెండున్నర ఏళ్లలో మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పిల్లర్ల పనులను రెండున్నర నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ నిర్దేశించారు. ఇవాళ్టి నుంచి నిర్మాణ పనుల కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

Details

ప్రత్యేకంగా ట్రాఫిక్ డైవర్షన్లు అమలు

వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగా మార్గ మళ్లింపులు చేపట్టారు. సాగర్ సొసైటీ వద్ద ప్రత్యేకంగా ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ నుంచి సాగర్ సొసైటీ రూట్‌లో అవసరాన్ని బట్టి రెండు వైపులా సింగిల్ రోడ్‌లో వాహనాల రాకపోకలు నిర్వహించనున్నారు. పనుల ప్రారంభానికి ముందు ట్రాఫిక్ పోలీసులు, రోడ్ ఇంజనీరింగ్ అధికారులు రూట్లను పరిశీలించారు.

Advertisement

Details

ట్రాఫిక్ మళ్లింపులు

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్-కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ (గేట్-1), ముగ్ధ జంక్షన్ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు. బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు వెళ్లేవారు రోడ్ నెం.10, క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యా భవన్ మీదుగా వెళ్లాలి. మాసాబ్ ట్యాంక్ నుంచి కేబీఆర్ పార్క్-జూబ్లీహిల్స్ వైపు వెళ్లేవారు విరించి హాస్పిటల్, రోడ్ నెం.12 జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ ద్వారా వెళ్లాలి. NFCL నుంచి శ్రీనగర్ కాలనీ, సాగర్ సొసైటీ, ఇందిరానగర్, లేబర్ అడ్డా మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు వెళ్లాలి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36/45 నుంచి NFCL వైపు వెళ్లే వాహనాలు ఇందిరానగర్, శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా ప్రయాణించాలి. వాహనదారులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Advertisement