Boeing's 737 MAX: బోయింగ్ 737 మ్యాక్స్‌లో సాఫ్ట్‌వేర్ లోపం.. భారత్‌లో 96 విమానాలపై ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ తన విమానాల్లో మరో సాఫ్ట్‌వేర్ సమస్యను గుర్తించింది. ల్యాండింగ్‌కు ముందు అనూహ్య పరిస్థితుల్లో విమానం అనుకున్న మార్గాన్ని మార్చాల్సి వస్తే.. ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ వ్యవస్థ పనిచేయడం నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ లోపం భారత్‌లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న 96 విమానాలకు వర్తించనుంది. దీంతో ఈ సమస్యపై విమానయాన రంగంలో మరోసారి చర్చ మొదలైంది.
వివరాలు
గత నెలలోనే సమాచారం..
ఈ సమస్యపై గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 737 విమానాలను నడుపుతున్న అన్ని విమానయాన సంస్థలకు సమాచారం అందించినట్లు బోయింగ్ తెలిపింది.
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
అయితే ఈ లోపం కారణంగా విమానాన్ని పైలట్లు మాన్యువల్‌గా నడపలేని పరిస్థితి తలెత్తదని బోయింగ్ స్పష్టం చేసింది.
భారత్‌లో ఎయిర్ ఇండియా వద్ద సుమారు 53, ఆకాశ ఎయిర్ వద్ద 43 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి.
వివరాలు
అసలు సమస్య ఏంటి?
కాక్‌పిట్ సాఫ్ట్‌వేర్‌లో చేసిన ఓ అప్‌డేట్ కారణంగానే ఈ సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సాధారణంగా విమానం నిర్దేశిత మార్గంలో ల్యాండింగ్‌కు చేరుకుంటుంది.
అయితే ఏదైనా కారణంతో ల్యాండింగ్ సాధ్యం కాకపోతే.. విమానం మిస్డ్ అప్రోచ్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మరోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో మొదట అనుకున్న మార్గానికి భిన్నమైన మార్గంలో విమానాన్ని నడపాల్సి రావచ్చు.
ఇలాంటి ప్రత్యేక పరిస్థితిలో ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ వ్యవస్థ డిసెంగేజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు బోయింగ్ గుర్తించింది.
అంటే విమానాన్ని నడిపే ఆటోమేషన్ సహాయం తగ్గిపోతుంది. అయితే దీనివల్ల విమానం ప్రమాదకరంగా గాలిలో అదుపు తప్పడం లేదా పైలట్లు విమానాన్ని నియంత్రించలేని పరిస్థితి ఏర్పడదని బోయింగ్ పేర్కొంది.
వివరాలు
భారత్‌లో 96 విమానాలకు వర్తింపు
మిస్డ్ అప్రోచ్ తర్వాత సిస్టమ్‌ను రీసెట్ చేయడంతో పాటు..ఇప్పటికే అమల్లో ఉన్న విధానాలను పాటించాలని పైలట్లకు సూచించింది.
ఈసమస్యను పూర్తిగా తొలగించేందుకు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.
బోయింగ్ 737మ్యాక్స్ విమానాలను నడుపుతున్న భారత విమానయాన సంస్థల్లో ఆకాశ ఎయిర్,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.
తాజా పరిణామంపై ఆకాశ ఎయిర్ స్పందించింది. ఈ సమస్య పరిష్కారానికి బోయింగ్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది.
తమ విమానాల కార్యకలాపాల భద్రతపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలు,నియంత్రణ సంస్థలు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగానే విమానాలను సురక్షితంగా నడుపుతున్నామని పేర్కొంది.
అయితే తమ విమానాల్లో ఇప్పటివరకు ఈ సమస్య ఏదైనా చోటుచేసుకుందా?అనే విషయాన్ని మాత్రం ఆకాశ ఎయిర్ వెల్లడించలేదు.
వివరాలు
బోయింగ్‌పై ఇప్పటికే నిఘా
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి ఈ అంశంపై వెంటనే స్పందన రాలేదు. భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఈ వ్యవహారంపై పరిశీలన ప్రారంభించిందా? విమానయాన సంస్థలకు ప్రత్యేకంగా ఏమైనా సూచనలు జారీ చేసిందా? అనే విషయాలు మరికొద్ది గంటల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.
గత ఏడాది జూన్‌లో అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ప్రమాదానికి గురై 260 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన తర్వాత భారత్‌లో బోయింగ్ విమానాల భద్రతపై మరింత దృష్టి సారించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ లండన్-బెంగళూరు మార్గంలో నడిచే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానాన్ని పైలట్ నివేదించిన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ సమస్య కారణంగా గ్రౌండ్ చేశారు.
వివరాలు
737 మ్యాక్స్‌పై ఎందుకింత దృష్టి?
అయితే ఆ తర్వాత బోయింగ్ నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి అసాధారణత గుర్తించలేదని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ఈ రెండు ఘటనలు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలకు సంబంధించినవి. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సాఫ్ట్‌వేర్ సమస్య మాత్రం 737 మ్యాక్స్ విమానాల్లో కనిపించింది.
భారత్‌లో బోయింగ్ విమానాల భద్రతపై పరిశీలన కొనసాగుతున్న సమయంలోనే మరో సాంకేతిక సమస్య బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,400కు పైగా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను డెలివరీ చేసింది.
అయితే ఈ మోడల్ గతంలో రెండు ఘోర ప్రమాదాల కారణంగా అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు వచ్చింది.
వివరాలు
737 మ్యాక్స్‌పై ఎందుకింత దృష్టి?
2018లో ఇండోనేషియాలో లయన్ ఎయిర్‌కు చెందిన 737 మ్యాక్స్ 8 విమానం ప్రమాదానికి గురై 189 మంది మరణించారు.
2019లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్ 8 ప్రమాదంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ రెండు ప్రమాదాల అనంతరం 737 మ్యాక్స్ విమానాల కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా కొంతకాలం నిలిపివేశారు.
తిరిగి సేవలు ప్రారంభమైన తర్వాత కూడా ఈ మోడల్ విమానాలు అప్పుడప్పుడు సాంకేతిక సమస్యల కారణంగా వార్తల్లో నిలిచాయి.
వివరాలు
737 మ్యాక్స్‌పై ఎందుకింత దృష్టి?
2024 జనవరిలో అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్ 9 విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో డోర్ ప్లగ్ ఊడిపోయింది.
దీంతో మరోసారి ఈ విమానాల తయారీ, నాణ్యత నియంత్రణపై ప్రశ్నలు తలెత్తాయి.
అయితే ఇప్పుడు బయటపడిన సమస్య వాటికి భిన్నమైనది.
ప్రత్యేకమైన ల్యాండింగ్ పరిస్థితిలో ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ వ్యవస్థ డిసెంగేజ్ అయ్యే అవకాశం ఉన్న సాఫ్ట్‌వేర్ లోపంగా దీనిని బోయింగ్ గుర్తించింది.
సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.