Page Loader
Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై గువాహటిలో కేసు నమోదు
రాహుల్‌ గాంధీపై గువాహటిలో కేసు నమోదు

Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై గువాహటిలో కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. దేశంతోనూ కాంగ్రెస్‌ పోరాడుతోందని ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గువాహటిలోని పోలీస్ స్టేషన్‌లో రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మోన్‌జిత్‌ చాటియా అనే వ్యక్తి ఈ ఫిర్యాదును చేశారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు పరిమితులను దాటి, జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని చాటియా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అశాంతి, వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్‌కు ఉందన్నారు. కానీ ఆయన అబద్ధాలు ప్రచారం చేసి దేశ ఐక్యతను, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని చాటియా ఆరోపించారు.

Details

కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది : జేపీ నడ్డా

ఇటీవల దిల్లీలో కాంగ్రెస్‌ నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ఆరెస్సెస్‌ వంటి భావజాలం వేల సంవత్సరాల నాటిదని, కానీ బీజేపీ, ఆరెస్సెస్‌ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు. ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రులతో పాటు పలువురి విమర్శలకు గురయ్యాయి. కాంగ్రెస్‌ అసలు స్వరూపం ఈ వ్యాఖ్యల ద్వారా బయటపడిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు మరియు కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు.